స్వానుభవమే.. సక్సెస్‌కి దిక్సూచి

Selfish.. A compass for successఅమ్మ తన కడుపులో ఉన్న బిడ్డని నవ మాసాలు మోస్తుంది. ఆ బిడ్డ ఆరోగ్య సంరక్షణకై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాంటి ఆరోగ్య రక్షణ అందించాలనే తాపత్రయానికి రూపమే టుమ్మి ఫ్రెండ్లీ ఫుడ్‌. టుమ్మి అంటే కడుపు. ఆ..పేరుతోనే ఆరోగ్య స్నేహిత్వాన్ని ఏర్పరచి,ఎన్నో ఆరోగ్య ధాయక ఆశయాలనీ ఆకాంక్షించి ఈ సంస్థను స్థాపించింది భువనగిరి బిడ్డ ఆశల శ్రీదేవి. ఇంజనీరింగ్‌ పూర్తి చేసి సక్సెస్‌ దిశగా అడుగులు వేస్తున్న ఆమె దానికి విభిన్న మైన మరో రంగాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం…
బాల్యం నుండి ఆటపాటల్లో, చదువులో చాలా చురుకుగా ఉండేదాన్ని. పదో తరగతిలో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో 12వ ర్యాంక్‌ సాధించాను. నా జీవితంలో అది ఓ అపురూప క్షణం. మా అమ్మ కమలమ్మ, నాన్న శాములు. నా 19 యేట మా నాన్న చనిపోయారు. అది మమ్మల్ని చాలా కుంగదీసింది. నా ఉన్నత చదువులకోసం మా అమ్మ చాలా కష్టపడింది. ఇంజనీరింగ్‌ చేసి మంచి ఉద్యోగం సంపాదించాక పెండ్లి చేసుకున్నాను. నేను, మావారు చిదానందం బెంగుళూర్‌లో స్థిరపడ్డాం. వృత్తి పరంగా చాలా వేగమైన పురోగతి సాధించాం. కానీ వ్యక్తిగత జీవితంలో వైఫల్యాన్ని చవిచూశాం.
ఉరుకుల పరుగుల జీవితంలో…
వృత్తిరీత్యా బిజీగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బయటి ఫుడ్‌ తినాల్సివచ్చేది. కానీ జీవనశైలిలో పోషక విలువలు కోల్పోవలసి వచ్చింది. అలాగే మా ఉరుకుల పరుగుల జీవనంలో ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాం. దీని వల్ల కొన్ని సమస్యలు అనుభవించాము. మా పెండ్లయిన కొన్నాళ్ళకే నాకు ప్రెగెన్సీ వచ్చింది. ఈ శుభవార్త మాలో ఎనలేనీ సంతోషాన్నీ, ఆశలనీ నింపింది. కానీ ఆ సంతోషం త్వరగా ఆవిరైంది. సరైన జీవనశైలి లోపం, సరైనా పోషకాహారం బిడ్డకి అందకపోవడంతో అబార్షన్‌ జరిగిందని డాక్టర్‌ చెప్పారు. ఫాస్టఫుడ్‌, ఇన్‌ స్టంట్‌ ఫుడ్‌పై ఎక్కువగా ఆధారపడటం నా గర్భంలో ఉన్న బేబిపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ నా స్వానుభవం ఎంతో బాధని మిగిల్చింది. సమస్య పరిష్కార దిశగా మార్గాన్ని నిర్దేశించింది. ఈ బాధే నాలో ఒక కొత్త పరిశోధనకి దోహదం చేసింది. పోషకవిలువలు పెంచుకోనే దిశగా అడుగులు సాగాయి.
ఉద్యోగాన్ని వదిలిపెట్టి…
న్యూట్రిషన్‌కి సంబంధించి పరిజ్ఞానం కోసం ఎన్నో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ప్రముఖ న్యూట్రిషయన్స్‌ వద్ద సలహాలు తీసుకుంటూ, చక్కని సమతుల ఆహారాన్ని ఇంటి వద్దే తయారుచేయడం ప్రారంభించాను. ప్రస్తుతం మాకు ఇద్దరు పాపలు ఆద్య, ఆరాద్య. మా పెద్దపాప పుట్టిన తర్వాత తనకిచ్చే ఆహరాన్ని పరిశీలిస్తే అందులో ఉండాల్సిన మోతాదుని మించి రసాయనాల వాడకం ఉండేది. అందుకే పాప కోసం ఇంట్లో నేనే చక్కటి ఆరోగ్యధాయకమైనా బేబిఫుడ్‌ తయారుచేయడం మొదలుపెట్టాను. పిల్లలకే కాకుండా మాకు కూడా అవసరమైన ఆహారాన్ని సేంద్రీయ ఉత్పత్తులతో తయారుచేసేదాన్ని. వీటన్నింటి కోసం నా ఉద్యోగానికి స్వస్తి చెప్పాను. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం పౌష్ఠికాహార ఉత్పత్తులను తయారు చేయాలని గట్టిగా సంకల్పించాను. పోషకాహారలోపం వల్ల నేను పడిన బాధ మరో తల్లి పడకూడదని భావించి టుమ్మి ఫ్రెండ్లీ ఫుడ్‌ స్థాపించాను. ఈ విషయంలో మావారు కూడా నన్నెంతే ప్రోత్సహించారు.
కుటుంబమే పరిశోధనా కేంద్రం
ఓ వైపు నిరంతరంగా సమతుల ఆహారం గురించిన అధ్యయనం కొనసాగిస్తూ, మరోవైపు నా కుటుంబాన్నే పరిశోధనా కేంద్రంగా మలచుకొన్నాను. నా వ్యాపారానికి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే దీని కన్నా ఎక్కువగా ఈ ఆహార ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మరింతగా కష్టపడాల్సి వచ్చింది. మొదట్లో బెంగుళూరులో స్థాపించిన సంస్థ తర్వాత వి హబ్‌ వారి ప్రోత్సాహంతో హైదరాబాద్‌లోని హయత్‌ నగర్‌లో కూడా ప్రారంభించాను. మా సంస్థ ప్రస్తుతం ఏడాదికి 2.5 కోట్ల టర్నోవర్‌తో ప్రగతి పథంలో దూసుకెళ్తుంది.
ఒడిదుడుకులు ఎదురైనా…
మన అనుభవాల ద్వారా ఎదురయ్యే పరిస్థితులు చాలా మార్పులకీ శ్రీకారం చుడతాయి. అలాంటి స్వానుభవమే నాకు దిక్సూచిగా మారి నన్ను వ్యాపారవేత్తగా మార్చింది. అలాగే మంచి ఆహారాన్ని ప్రజలకు అందించే అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ సక్సెస్‌ వెనుక ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవల్సి వచ్చింది. వాటన్నింటినీ స్వశక్తితో ధైర్యంగా ఎదుర్కోగలిగాను. దీనికి నా కుటుంబం కూడా నాకు అండగా నిలబడింది. ఒకప్పుడు ఏటికి ఎదురీదిన మా సంస్థ ఇప్పుడు ఎందరికో ఆర్థిక స్వావలంబననీ అందిస్తుంది. అలాగే మరెందరికో ఆరోగ్య రక్షణకి బాసటగా నిలుస్తుందని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను.
– టి.కిరణ్మయి, 9441711652