– ఆర్‌సిఓ డేవిడ్ రాజ్
నవతెలంగాణ-భద్రాచలం
టెన్త్, ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల కోసం గిరిజన గురుకుల విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు నిచ్చేందుకు భద్రాచలం, కిన్నెరసానిలో కోచింగ్ క్యాంప్ తరగతులు ఏర్పాటు చేసినట్లు భద్రాచలం ఐటిడిఏ ఏపీవో (జనరల్), గిరిజన గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి హెచ్ డేవిడ్ రాజ్ తెలిపారు. భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలో నిర్వహిస్తున్న అడ్వాన్స్ సప్లమెంటరీ కోచింగ్ క్యాంప్ తరగతులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ…. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో గిరిజన గురుకులాల్లో చదివి టెన్త్, ఇంటర్ పరీక్షల్లో తప్పిన బాల, బాలికల ప్రయోజనార్థం ఏప్రిల్ 22 నుంచి, పరీక్షల వరకు బాలికలకు భద్రాచలం గిరిజన గురుకుల సంస్థలో, బాలురకు కిన్నెరసానిలో కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భద్రాచలం, వైరా, మణుగూరు, అన్నపురెడ్డిపల్లి,కొత్తగూడెం, సుదిమల్ల,అంకంపాలెం తదితర 7 గిరిజన గురుకులాల నుంచి మొత్తం 255 మంది ఇంటర్ బాలికలు భద్రాచలం గిరిజన గురుకుల కోచింగ్ క్యాంప్ లో తర్ఫీదు పొందుతున్నట్లు వెల్లడించారు. దమ్మపేట, కిన్నెరసాని, గుండాల, ఖమ్మం,సింగరేణి, తిరుమలాయపాలెం తదితర గిరిజన గురుకులాల నుంచి 200 మంది ఇంటర్ బాలురు కిన్నెరసానిలో నిర్వహిస్తున్న కోచింగ్ క్యాంపుకు హాజరవుతున్నట్లు తెలిపారు. అలాగే భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో 79 మంది బాలికలు, కిన్నెరసానిలో 30 మంది బాలురు 10వ తరగతి సప్లిమెంటరీ కోచింగ్ క్యాంపులో హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల, పాఠశాల ప్రిన్సిపాల్ ఎం దేవదాసు, కళాశాల, పాఠశాల స్టాప్ తదితరులు పాల్గొన్నారు.