డయాలసిస్‌ కేంద్రం పేదలకు ఒక వరం

– నేడే ప్రారంభించిన విప్‌ రేగా
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు చేతుల మీదుగా ప్రారంభించడానికి నేడు సిద్ధంగా ఉంది. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పేదలకు వరంగా పనిచేస్తుందని ఈ ప్రాంత ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుమారు 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయబడింది. పేద ప్రజల చెంతకు కార్పొరేట్‌ వైద్యం ప్రభుత్వ లక్ష్యంతో డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో నిలిచిపోతుంది. ఏదైనా జబ్బు చేసి ఆసుపత్రికి వెళ్తే చికిత్స కంటే వైద్య పరీక్షలకే డబ్బులు ఖర్చవుతున్న ఈ రోజుల్లో రక్తపరీక్ష వరకు అనేక టెస్టులు, వాటికి వేలకు వేలకు పోయాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలపై ఈ భారం పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. గతంలో కిడ్నీ రోగం వస్తే ప్రాణాలు పోయే అంత పని అవ్వడమే కాకుండా వ్యయ ప్రయాసలు, తిండి తిప్పలు ఓర్చుకునే హైదరాబాద్‌ ప్రాంతాలకు వెళ్లి డయాలసిస్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ స్వరాష్ట్రంలో అలాంటి పరిస్థితులకు చరమ గీతం పాడారు సీఎం కేసీఆర్‌. ఉస్మానియా, నిమ్స్‌, గాంధీ వంటి మూడు ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన డయాసిస్‌ సేవలను ఏకంగా 102కు పెంచి సేవలు విస్తృతం చేయడం ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరులో ప్రారంభించడం ఈ ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. దూర ప్రాంతాలకు వెళ్లకుండా పేద ప్రజల చెంతకే వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో బాధితులకు అందుబాటులో ఉండడం గొప్ప విశేషం.