పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి

– అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు అందేలా చూడండి
– ఏదులాపురం చెరువుకట్టను మినీట్యాంక్‌బండ్‌గా మార్చండి
– క్రీడాప్రాంగణం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, హాస్టల్‌ను మంజూరు చేయండి
– మంత్రి పొంగులేటికి సీపీఐ(ఎం) నాయకుల వినతి
నవతెలంగాణ-ఖమ్మంరూరల్‌
మండల పరిధిలోని ఏదులాపురం గ్రామ పంచాయతీలో కొన్ని ఏండ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న అనేక సమస్యలను రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖా మాత్యులు, స్థానిక ఎంఎల్‌ఏ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి సీపీఐ(ఎం) నాయకులు తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. అతి త్వరలోనే సమస్యలకు పరిష్కారం చూపుతానని వారికి మంత్రి హామీ ఇచ్చారు.
ఏదులాపురం గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు వూరడి సుదర్శన్‌రెడ్డి మంత్రిని కలిసి గ్రామ సమస్యలను వివరించారు.
– తమ పంచాయతీ పరిధిలోని ఏదులాపురం, చిన్నతండా, తాళ్లేసేతండా, సత్యనారాయణపురం, వరంగల్‌ క్రాస్‌రోడ్‌లో సుమారు 1500 మంది కడు నిరుపేద కుటుంబాలు ఉన్నాయన్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వారంతా కొన్నేండ్లుగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారన్నారు. వారందరికీ తమ పంచాయతీ రెవెన్యూ పరిధిలో గల ప్రభుత్వ భూమిని సర్వే చేసి హద్దులు పైనల్‌ చేసి వారికి పంపిణీ చేయాలని కోరారు.
– కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీలను రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ అందేలా చూడాలని కోరారు.
– ఏదులాపురం గ్రామ పంచాయతీ 20వేల జనాభాతో పెద్ద ప్రాంతంగా విస్తరించి ఉన్నదని, ఈ పరిధిలో వందలాది మంది యువతీ, యువకులు ఉన్నారని, వారికి క్రీడా ప్రాంగణాన్ని మంజూరు చేయాలని కోరారు.
– తమ గ్రామ పంచాయతీలో అనేక వెంచర్లు వెలిశాయని, కానీ ఏ ఒక్క కాలనీలోనూ పార్కులు లేవు అన్నారు. ఉదయం, సాయంత్రం వేళలలో వృద్ధులు, విశ్రాంతి ఉద్యోగులు, యువతీ, యువకులు మరియు పిల్లలు స్వేద తీర్చుకోవడానికి ఏదులాపురం చెరువుకట్టను మిని ట్యాంక్‌ బండ్‌గా చేయుటకు కృషి చేయాలని కోరారు. అలాగే వరంగల్‌ క్రాస్‌రోడ్‌లో నూతన రేషన్‌షాపును ఏర్పాటు చేయాలని విజ్జప్తి చేశారు.
– తమ గ్రామానికి చెందిన కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు అలాగే ఆకుకూరలు, కాయకూరలు అమ్మే సన్నకారు రైతులు, పాలు అమ్ముకునే రైతులు, తాఫీ వర్కర్లు నిత్యం ఖమ్మంకు వెళ్తుంటారని, గతంలో ఖమ్మం ఆర్టీసి బస్సు ఖమ్మం నుండి వరంగల్‌ క్రాస్‌ రోడ్‌- గనపవరం స్టేజి- ఏదులాపురం, ముత్తగుడెం, ఆరెకోడు వరకు 3 ట్రిప్పులు నడిచేదని, కావున ఆ బస్సును మళ్ళీ పునరుద్దరించ వలసిందిగా కోరారు.
– ఖమ్మంరూరల్‌ మండలం జిల్లాలోనే పెద్ద మండలంగా సుమారు 2 లక్షల జనాభాతో ఉన్నదని, ఈ మండలంలో దళితులు, గిరిజనులు, బిసిలు, ఈబిసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, కావున ఈ మండలానికి ప్రభుత్వ జూనియర్‌ కాలేజిని, గర్ల్స్‌, బార్సు హాస్టళ్లను మంజూరు చేయవలసిందిగా కోరారు.
కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు వల్లేపు సోమరాజు, ఏదులాపురం పీఏసీఎస్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ వూరడి హైమావతి, మండల కమిటీ సభ్యులు దుండిగాల వెంకటేశ్వర్లు, శాఖా కార్యదర్శి దుండిగల నాగయ్య, ప్రముఖ న్యాయవాది పొన్నెకంటి నరసింహారావు, డీవైఎఫ్‌ఐ నాయకులు పొన్నెకంటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.