నవతెలంగాణ-ఖమ్మం
కారేపల్లి మండలం మాణిక్యారం, ఎర్రబోడు పోడు సాగుదారులు సాగు చేసుకుంటున్న భూమిలో 2018 సంవత్సరంలో మొక్కలు నాటారని, ఫారెస్ట్ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకొని మీకు వేరేచోట భూమి ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని నేటికీ నెరవేర్చకపోగా, ఎస్సీ, బిసి, గిరిజన, పేద పోడు సాగుదారులపైన, సిపిఎం మండల కార్యాలయంపైన ఫారెస్ట్ అధికారులు దాడులు చేయడాన్ని పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. సిపిఎం కారేపల్లి కార్యాలయంపైన ఫారెస్ట్ అధికారుల దాడులను నిరసిస్తూ బుధవారం ఖమ్మం నగరంలోని నిర్మల్ హృదరు స్కూల్ సెంటర్ వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కారేపల్లి సిపిఎం కార్యాలయంలో పోడు సాగుదారులు వున్నారనే నెపంతో పోలీసు, ఫారెస్ట్ అధికారులు పార్టీ కార్యాలయంపైన దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి ఫారెస్ట్ అధికారులు సిద్దపడ్డారన్నారు. ఈ ఘటనపైన జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చొరవ తీసుకొని విచారణ జరిపి ఫారెస్టు అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, నందిపాటి మనోహర్, యస్.నవీన్ రెడ్డి, ఆర్.ప్రకాష్, ఎస్.కె.బషీర్, నాయకులు కె.అమరావతి, చింతల రమేష్, సుధాకర్, చిరంజీవి, బిక్షం, పుల్లారావు, భారతమ్మ, రామారావు, కొండల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ(ఎం) కార్యాలయంపై ఫారెస్ట్ అధికారుల దాడి ప్రయత్నం సిగ్గుచేటు
వైరాటౌన్: కారేపల్లి మండల సిపిఐ(ఎం) కార్యాలయం భాగం రాంనర్సయ్య భవనం పైన ఫారెస్ట్ అధికారులు దాడి ప్రయత్నం సిగ్గు చేటు అని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. బుధవారం వైరా సిపిఎం కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో జరిగిన సమావేశంలో బొంతు రాంబాబు మాట్లాడుతూ కారేపల్లి మండలం ఎర్రబోడు, మాణిక్యారం గ్రామాల్లో 60, 70 సంవత్సరాల నుండి పోడు సాగుచేస్తున్న రైతులకు ప్రత్యామ్నాయ సాగు భూములు ఇస్తామని చెప్పి రైతుల భూములు ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకుని మొక్కలు పెంచడం జరిగిందని, రైతులకు మాత్రం ప్రత్యామ్నాయ భూములు చూపలేదని, తమ భూములు మాకు తిరిగి అప్పగించాలని రైతులు పోరాటం చేయడంతో గిరిజన రైతులు పైన ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసులు నమోదు చేసి సిపిఎం కార్యాలయంలో గిరిజన రైతులు ఉన్నారనే సాకు చూపి ఆఫీస్ పైన దాడికి యత్నించారని, సిపిఎం శ్రేణులు దాడిని అడ్డుకున్నారు అని అన్నారు. ఈ లాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం నివారించాలని బొంతు రాంబాబు కోరారు. ఈ సమావేశంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, మాజీ ఎంపిపి బొంతు సమత, సిపిఎం నాయకులు దొడ్డాపనేని కృష్ణార్జనరావు, నూకల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.