– కొన్ని కేసులు ఒక జడ్జి ముందుకే ఎందుకు వెళుతున్నాయి?
– సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకుర్ సూటి ప్రశ్న
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చేపడుతున్న కేసుల లిస్టింగ్, బదిలీలపై అనేకమంది న్యాయ నిపుణులు, పౌరులు ప్రశ్నలు లేవనెత్తుతున్న విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకుర్ కూడా వారితో గొంతు కలిపారు. న్యాయమూర్తులందరూ సమానమే అయినప్పుడు కొన్ని కేసులను ఒకే న్యాయమూర్తి వద్దకు ఎందుకు పంపుతున్నారని ఆయన ప్రశ్నించారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సుప్రీంకోర్టుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. సుప్రీంకోర్టు రోస్టర్ విధానం పైన అడిగిన ప్రశ్నలకు జస్టిస్ లోకుర్ బదులిస్తూ కొన్ని సున్నితమైన కేసులు ఒకే న్యాయమూర్తి లేదా కొందరు న్యాయమూర్తుల వద్దకే వెళుతున్నాయని, అందుకు కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పారు. న్యాయమూర్తులందరూ సమానమే అయినప్పుడు ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. రోస్టర్ పద్ధతిపై చెలరేగిన వివాదం గురించి 2018లో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన నలుగురు న్యాయమూర్తులలో జస్టిస్ లోకుర్ ఒకరు. కొన్ని కేసులను ఒకే న్యాయమూర్తి వద్దకు పంపడం సమస్యలకు దారితీస్తోందని, దురదృష్టవశాత్తూ ఆ విధానం ఇంకా కొనసాగుతోందని ఆయన చెప్పారు. రోస్టర్ అధిపతి అయిన ప్రధాన న్యాయమూర్తి ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రోస్టర్ విధానంపై లోతుర్ ఒక్కరే గొంతు విప్పడం లేదు. గత సంవత్సరం డిసెంబరులో సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ఈ విషయంపై ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కేసులను ఎలా లిస్ట్ చేస్తున్నారని అందులో ప్రశ్నించారు. దవే తన లేఖలో అనేక రాజ్యాంగ నిబంధనలను, నియమాలను ప్రస్తావించారు. మానవ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన రాజ్యాంగం పనితీరు వంటి సున్నితమైన అంశాలలో నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారని విమర్శించారు. ‘మొదటి కోరం అందుబాటులో ఉన్నప్పటికీ రెండో కోరం నేతృత్వంలోని బెంచ్‌లకు కేసులు లిస్ట్ చేస్తున్నారు. 2, 4, 6, 7 నెంబరు కోర్టుల ముందు లిస్ట్ అయిన కేసులను వేరే బెంచ్‌లకు బదలాయించడం నిబంధనలకు విరుద్ధమే. ఈ విషయంలో నియమ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే మొదటి కోరం సీనియారిటీని విస్మరిస్తున్నారు’ అని ఆ లేఖలో దవే ఎత్తిచూపారు.
మరో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా సుప్రీం రిజిస్ట్రీకి లేఖ రాస్తూ జస్టిస్ బేలా ఎం త్రివేదీకి పక్షపాతంతో కేసులు కేటాయించిన వైనాన్ని ప్రస్తావించారు. నాలుగు నెలల కాలంలో రాజకీయంగా సున్నితమైన ఎనిమిది కేసులను ఒకే న్యాయమూర్తికి పంపారని గుర్తు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులు జస్టిస్ త్రివేది ముందుకు వస్తున్నాయని ఆయన తెలిపారు.