– బోధనలు ఇవ్వడమే కాక పోరాటం ఆచరణలో రుజువు చేశారు
– లెనిన్ శత వర్ధంతి సభలో ఓయూ ప్రొఫెసర్ కాసిం
నవతెలంగాణ-ఇల్లందు
ప్రపంచంలోని సామ్రాజ్యవాద యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చి విప్లవ విజయాన్ని సాధించగలిగింది ఒక లెనిన్ మాత్రమేనని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం అన్నారు. లెనిన్ శతవర్ధంతి సందర్భంగా శనివారం సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ నార్త్-ఈస్ట్ రీజినల్ కమిటీ ఆధ్వర్యంలో న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు అధ్యక్షతన సభ నిర్వహించారు. ముఖ్య వక్తగా ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక భావాలు వికసించడం ప్రారంభమైందన్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు చైనా విప్లవానికే కాదు వలస విముక్తి కూడా కారణమైందని, తూర్పు యూరప్ దేశాలలో విప్లవ విజయానికి దారితీసిందని ఆ యుద్ధాన్ని, సామ్రాజ వాదాన్ని అర్థం చేసుకొని లెనిన్ చెప్పిన బోధనలు ఆచరించిన విప్లవ పోరాటమే ఆ దేశ విముక్తికి, విజయానికి దోహదపడ్డాయన్నారు. దోపిడీ ప్రభుత్వాల స్థానంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని ఈ ఏర్పాటు కొరకు కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకం కావాలని ఈ సందర్భంగా విప్లవ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మహ-బాద్ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు తుపాకులు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.