డాక్టర్ సిరిపురపు జ్యోతి… గొప్ప మానవతావాది. ఎనస్తీషియా వైద్యురాలిగా సుపరిచితురాలైన ఆమె నిస్వార్థ సేవల గురించి ఉయ్యూరు ప్రాంతంలో తెలియని వారంటూ లేరు. వృత్తి లోనూ, ప్రవృత్తిలోనూ మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి ఆమె. తన గురించి పక్కన పెట్టి ఇతరుల కష్టసుఖాల గురించి ఆలోచించడం ఆమె పుట్టుకతో వచ్చిన తత్వం. పేదలకు విద్య, వైద్య పరంగా అనేక సేవా కార్యక్ర మాలు చేపట్టారు. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టింది కాబట్టే ఆమె ఇలా జీవించగలిగిందని నా నమ్మకం. సామాజిక స్పహతో నిత్యం పేదలకు చేయూతనిచ్చే ఆమె క్యాన్సర్‌తో పోరాడి ఇటీవలె మరణించింది. మరణానంతరం కూడా కొంతమంది మహనీయులుగా సమాజంలో అలా మిగిలిపోతారు. అలాంటి కోవకే చెందుతారు ఆమె. అలాంటి గొప్ప వ్యక్తిత్వమున్న ఆమె జయంతి ఈ రోజు. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవిత పరిచయం మానవి పాఠకులకు ప్రత్యేకం.
నాగేళ్ల రాజేశ్వరమ్మ, జానకి రామయ్యలకు ఏకైక కుమార్తె జ్యోతి. బాల్యం నుండి అల్లారు ముద్దుగా బంధువులు, ఇరుగుపొరుగు వారి ఆలనా పాలనలో పెరిగింది. అమ్మ ఎప్పుడూ తన దగ్గరే ఉండాలని కోరుకుంది. ‘నా 12 ఏండ్ల వయసులో చదువు కోసం ఫిరంగిపురం హాస్టల్‌కు నన్ను పంపుతున్న రోజున నేను వెళ్లే వరకు నాతో ఉండమని అమ్మను అడిగాను. కానీ నాకు మీటింగ్ ఉంది, నాన్నకు కూడా నీవే భోజనం పెట్టి వెళ్ళమని చెప్పినప్పుడు చాలా బాధ పడ్డాను. వయసు పెరిగే కొద్దీ అమ్మ చేస్తున్న ప్రజాసేవకు గురించి అర్ధమయింది. బంధువులు, ఇరుగుపొరుగువారు ‘భర్తను, పిల్లను పట్టించుకోకుండా మీటింగ్‌లంటూ వెళుతుంది’ అని అంటే అస్సలు సహించేదాన్ని కాదు. మా అమ్మ ఆశయం చాలా గొప్పది అని వారితో వాదించేదాన్ని’ అంటూ తన తల్లి గురించి మాతో ఎప్పుడూ చెప్తుండేవారు. ఆ మాటలు మాలో ఎంతో స్ఫూర్తిని నింపేవి.
మహనీయుల మధ్యన…
స్వాతంత్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలం అది. మరో వైపు రామ్మోహనరావు, గురజాడ, వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తల నాయకత్వంలో సాంఘిక దురాచారాలు, సతీసహ గమనం, బాల్య వివాహాలు, వివక్ష, అసమానత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆడవాళ్లు గడప దాటి బయటకు వెళ్ల కూడదని అంక్షలు నడుస్తున్న కాలంలో కడియాల గోపాలరావు, పుచ్చలపల్లి సుందరయ్య, మానికొండ సుబ్బారావు వంటి మహనీయులు మహిళలను చైతన్య పరిచి 1936లో కృష్ణా జిల్లా మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశారు. దానిని నిర్వహించే బాధ్యతలు మానికొండ సూర్యవతి, నాగేళ్ల రాజేశ్వరమ్మ, వల్లభనేని సీతామహాలక్ష్మీ, చండ్ర సావిత్రీదేవి, డా||అచ్చమాంబ తదితరులకు అప్పగించారు. ఆనాటి నుండి జరిగిన పోరాటాల ఫలితంగానే తర్వాత కాలంలో మహిళలకు అనేక హక్కులు అందించాయి. అలాంటి వారి మధ్య పెరిగి, అభ్యుదయ భావాలను అందిపుచ్చుకున్న మానవతా వాది డా.జ్యోతి. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత జరిగిన ఓ సమావేశానికి రాజేశ్వరమ్మతో పాటు జ్యోతి కూడా వచ్చింది. అప్పుడే నాకు ఆమెతో పరిచయం. అప్పటి నుండి ఆమెను అప్యాయంగా అక్కా అని పిలుచుకునేదాన్ని.
తల్లి నిర్భంద జీవితంతో…
కృష్ణాజిల్లాలోని కాటూరు గ్రామానికి ‘ఆంధ్రామాస్కో’గా పేరుంది. కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉన్న ఇలాంటి గ్రామాలు ఆనాడు పెద్ద ఎత్తున జరుగుతున్న తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటానికి ఎన్నుదన్నుగా నిలబడ్డాయి. అలాంటి బలమైన గ్రామాలపై ప్రభుత్వం నిఘా పెంచింది. పార్టీపై నిషేదం విధించింది. ఆ రోజుల్లో జ్యోతి తల్లి రాజేశ్వరమ్మ రహస్య జీవితంలో ఉన్నారు. రహస్యంగా ఉన్న వారిని పట్టి ఇవ్వాలని ప్రభుత్వం ప్రజలను భయపెట్టింది. భయపెట్టడమే కాక మలబారు పోలీసులు గ్రామంలో ప్రజలపై దాడులు చేసి అత్యంత అమానుషంగా 150 మందిని వీధుల్లోకి లాక్కొచ్చారు. వివస్త్రలను చేసి లాఠీలతో కొట్టారు. ఊరంతా నగంగా ఊరేగించుకుంటూ గాంధీ బొమ్మ చుట్టు ప్రదర్శనలు చేయించారు. ఈ హేయమైన, అమానుషమైన చర్య రాష్ట్రమంతా దావానంలా వ్యాపించింది. అప్పటికి చిన్నదైన జ్యోతిని ఈ ఘటన భయబ్రాంతులకు గురిచేసింది.
స్ఫూర్తిని నింపాయి…
తన తల్లి జైలు, రహస్య జీవితం అనుభవించింది. అయినా ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లి తాను నమ్మిన మార్క్సిజం – లెనినిజం సిద్ధాంతానికి చివరి దశ వరకు కట్టుబడి ఉండటం జ్యోతిలో స్ఫూర్తిని నింపాయి. ‘నా చదువు విషయంలో అమ్మ ప్రత్యేక శ్రద్ద తీసుకోనేది. విశాఖ ఆంధ్ర యూనివర్శిటీలో మెడిసన్ చదివేటప్పుడు ఊరి నుండి మా ఇంట్లో పని చేస్తున్న రాములును నాకు సాయం చేసేందుకు పంపింది. అప్పట్లో నేను నా క్లాస్‌మేట్ జగత్‌ను ఇష్ట పడ్డాను. వివాహం చేసుకుంటానని అమ్మతో చెప్తే తనే నాన్నను ఒప్పించింది. 1965లో నా వివాహాన్ని ఘనంగా జరిపించింది. కానీ 1967లో డాక్టర్ జగత్ అనారోగ్యంతో మరణించారు. దాంతో చాలా కుంగిపోయాను’ అంటూ మాతో అప్పుడప్పుడు చెప్పుకొని బాధపడేవారు.
ట్రస్ట్ ఏర్పాటు చేసి…
తల్లి అనారోగ్యంగా ఉన్న సమయంలో జ్యోతి ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంది. ఏలాంటి బెడ్‌సోర్సెస్ రాకుండా జాగ్రత్త పడింది. ఆ సమయంలోనే జ్యోతి చర్మ క్యాన్సర్ బారిన పడ్డారు. అయినా తన ఆరోగ్యం కన్నా తల్లి ఆరోగ్యాన్నే చూసుకుంది. తాను ఓ డాక్టర్ అయి ఉండి కూడా తన ఆరోగ్యం గురించి పట్టించుకోక పోవడం మాకు చాలా బాధగా అనిపించేది. తన తల్లి కోసమే జీవిస్తుందా అన్నట్టుగా ఉండేది. అలా చివరి వరకు పేదల కోసమే పని చేసిన తల్లి రాజేశ్వరమ్మ 2016లో చనిపోయారు. తన తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఆమె వారి పేరుతో ఉయ్యూరులో ఓ ట్రస్టును ఏర్పాటు చేసి దాని నిర్వహణకు, ఆఫీసు నిర్మాణానికి 30 లక్షలు ఖర్చుపెట్టింది. కరెంటు పోతే ఇబ్బంది అవుతుందని జనరేటర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసింది.
తన తర్వాత కూడా…
క్యాన్సర్ వ్యాధితో చివరి దశలో ఉన్న జ్యోతి తన అమ్మ నాన్న ఆశయాలు చిరకాలం నిలవలని బ్యాంకులో తన అకౌంట్ పేరుతో ఉన్న 71 లక్షలను ఉయ్యూరులో నాగళ్ళ రాజేశ్వరమ్మ, జానకి రామయ్య విజ్ఞాన కేంద్రానికి కార్ఫస్ ఫండ్‌గా ఏర్పాటు చేసింది. దాని పైన వచ్చే వడ్డీని పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, వత్తి శిక్షణా కేంద్రాలు నిర్వహించాలని ఆమె కాంక్షించింది. మనుషులు పుడతారూ, చనిపోతూనే ఉంటారు. ఈ రెండు సంఘటనల మధ్య జీవితాన్ని ఎలా గడిపారు, తన చుట్టూ ఉన్న సమాజం పట్ల ఎలా ప్రవర్తించారు అనేదే ముఖ్యం. అలా నిజంగా జీవించిన జ్యోతి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. తల్లి రాజేశ్వరమ్మ ఆశయాన్ని, ఆదర్శాన్ని తేది వరకు పాటించి, తన తర్వాత కూడా పేదలకు సేవలు కొనసాగాలని కోరుకున్న గొప్ప మానవతా వాది, ధన్యజీవి ఆమె.
ఆదాయం మొత్తం పేదలకే…
జ్యోతి స్పెషలైజేషన్ (ఎనస్తీషీయా) చేయటానికి ఇంగ్లాండ్ వెళ్లింది. 1977లో తల్లిదండ్రుల ప్రోద్భలంతో డాక్టర్ ప్రసాద్‌ను వివాహం చేసుకుంది. తర్వాత అమెరికా, ఇంగ్లాండు, దుబారు, అబూదబి మొదలైన దేశాల్లో వైద్యురాలిగా పని చేసింది. ఇండియా వచ్చి కొద్ది కాలం హైదరాబాద్‌లో ప్రాక్టీస్ కొనసాగించింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకునేందుకు సొంతూరైనా కాటూరు వచ్చి అక్కడి నుండే ఉయ్యూరు, కానూరు, విజయవాడ, మచిలీపట్నం హాస్పిటల్స్‌లో ఎనస్తీషీయాగా వైద్యాన్ని అందించేది. వైద్యురాలిగా తనకు వచ్చిన ఆదాయం మొత్తం పేద రోగుల మందులు, వారి పిల్లల ఫీజులకు ఉపయోగించేది. తన చివరి దశలోనూ పేదవారు ఎవరైన వైద్య సహాయం కోసం వస్తే డాక్టర్ దగ్గరకు పంపడమే గాక ఒక్కో సందర్భంలో వారి ఫీజులు కూడా ఈమే చెల్లించేది. తన ఇంట్లో పని చేసే వారి పిల్లలకు ఉన్నత చదువులకు ఆర్ధిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకుంది.
– కె.స్వరూపారాణి