పోటీ తత్వంతో ముందుకు సాగండి

– ఎస్కేఎస్‌ చారిటీ ప్రతిభ పురస్కారాల పంపిణీ
నవతెలంగాణ-చర్ల
విద్యార్థులు పోటీ తత్వంతో ముందుకు సాగడం ద్వారా తాము అనుకున్న లక్ష్యాలు సిద్ధించి విజయాలను సాధించగలుగుతారని తహసీల్దార్‌ భరణి బాబు పిలుపునిచ్చారు. శ్రీనివాస కళ్యాణం మండపంలో ఎస్‌కేఎస్‌ చారిటీ సంస్థ మండలంలోని ప్రతిభ చాటిన ఇంటర్‌, పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. క్రమశిక్షణ లేని చదువు చుక్కాని లేని నావ వంటిదని.. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ.. పట్టుదలతో చదివి తమ తల్లిదండ్రుల ఆశయాలను, వారి ఆకాంక్షలను నెరవేర్చాలని సూచించారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా విజయం సాధించగలుగుతారని సూచించారు. విద్యార్థులకు ప్రతి ఏటా పురస్కారాలను అందిస్తూ వారికి చేదోడుగా నిలుస్తున్న ఎస్కే షాజహాన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎంతో ఆదర్శప్రాయులని ఈ సందర్భంగా ప్రముఖులు కొనియాడారు. మండలంలోని 53 మంది విద్యార్థులకు దాదాపు మూడు లక్షల రూపాయల నగదు పురస్కారాలతో పాటు జ్ఞాపికలను ఈ సందర్భంగా అందించారు.. ఈ సదస్సులో సంస్థ అధ్యక్షులు ఎస్కే షాజహాన్‌, ఎంపీపీ కోదండరామయ్య, జడ్పీటీసీ ఇర్పా శాంత, ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్‌, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.