– రోజుకో సాకుతో విద్యుత్ సరఫరా నిలిపి వేత
– మోత మోగుతున్న బిల్లులు
– కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఇరువై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా పేపర్లలో ప్రకటనకు, టీవీల్లో ఊకదంపుడు ఉపన్యాసాలలో తప్ప వాస్తవంగా లేదని కాంగ్రెస్ మండల అధ్యక్షులు మొగళ్ళపు చెన్నకేశవరావు అన్నారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో మండలంలో నెలకొన్న విద్యుత్ వినియోగదారుల సమస్యలపై స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్లు ముందు నిరసన తెలిపి సంబంధిత అధికారులకు లిఖిత పూర్వక వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదో ఒక సాకుతో తరుచూ విద్యుత్ కోతలు విధిస్తున్నారని, గతంలో కరెంటు పోతే వార్త ఇప్పుడు కరెంటు ఉంటే వార్త అన్న చందంగా ఉందని ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో రైతులకు వ్యవసాయం కోసం 24 గంటలు విద్యుత్తు సరఫరా మాట ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం మండలంలో కరెంటు కష్టాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేసారు. చిన్నపిల్లల, వృద్ధులు, రైతులు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన తెలిపారు. మరోవైపు అదనపు వినియోగం పేరుతో వినియోగించిన కరెంటు చార్జీలు బదులు మూడింతలు బిల్లులు మోపడంతో వినియోగదారులు షాకు గురవుతున్నారన్నారని వ్యంగ్యం వ్యక్తం చేసారు. గతంలో అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ (ఏఎస్ఓ) పేరుతో అదనంనంగా డిపాజిట్‌ను కట్టించుకున్న ఎన్పీడీసీఎల్ ఇప్పుడు అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ (ఏసీడీ) పేరుతో మళ్లీ బిల్లులు పంపిస్తోంది అని తెలిపారు. వివిద ప్రాంతాల్లో రిపేర్లు చేస్తున్నట్లు ప్రకటించి, నిత్యం 8 గంటల పాటు కరెంట్ కోత విధిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం ఏమిటని ప్రశ్నించారు. హరిత హారంలో భాగంగా మొక్కలను విద్యుత్ లైన్ల కింద నాటి పెరిగి పెద్దవైన తర్వాత కొమ్మలు అడ్డొస్తున్నాయని వాటిని నరకడం పనిగా విద్యుత్ సిబ్బంది పెట్టుకున్నారని తెలిపారు. నిత్యం ఎదో ఒక కారణంతో గంటల తరబడి కరెంట్ సరఫరాలో కోత విధించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నార న్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు ఎస్.కే.పాషా, ఎంపీటీసీ వేముల భారతి, జల్లిపల్లి దేవరాజు, తగరం రాజేష్, రమాదేవి, వెంకన్న బాబు, సానబోయిన అంజి, మేక అమర్నాథ్లు పాల్గొన్నారు.