చెరువులో మట్టి తోలకాలు

– అడ్డుకున్న మొసలి మడుగు గ్రామస్తులు
– తాలిపేరు కాలువ కరకట్ట పటిష్టం కోసం మట్టి తోలకాలు : జేఈఈ
నవతెలంగాణ -దుమ్ముగూడెం
మండలంలోని పర్ణశాల గ్రామపంచాయతీ పరిధిలోని మొసలిమడుగు చెరువు నుండి ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న మట్టి తోలకాలను పర్ణశాల జీపీ ఉపసర్పంచ్‌ వాగె ఖాదర్‌బాబు, పీసా కార్యదర్శి వాగె రాజేశ్వరి ఆధ్వర్యంలో గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. ఆయుకట్టు రైతులకు కనీస సమాచారం లేకుండా చెరువు మట్టి ఎక్కడకు తోలుతున్నారంటూ నిలదీశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చెరువు పూడిక తీత పనుల వలన ఆయుకట్టు రైతులకు మేలు జరుగుతుందని కనీసం గ్రామ సభ నిర్వహించి పనులు చేపట్టాలని పనుల వద్దకు వచ్చి ఇరిగేషన్‌ శాఖ డీఈ తిరుపతిరావు దృష్టికి తీసుకుపోయారు. ఏ ప్రాతిపదికప మట్టి తోలకాలను అడ్డుకుంటున్నారని ఆయన వారిని నిలదీశారు. దీంతో వారు మాట్లాడుతూ ఎజన్సీ చట్టాలను తుంగలోకి తొక్కి అధికారులు మట్టి తోలకాలు సాగిస్తున్నారని వారు ఆరోపించారు. కాగా తాత్కాలికంగా మట్టి పనులు నిలిపివేశారు. మట్టి తోలకాలు అడ్డుకున్న వారిలో వార్డు సభ్యులు సకినం సతీష్‌, గ్రామస్తులు గజేందర్‌, సమ్మయ్య తదితరులు ఉన్నారు.
తాలిపేరు కరకట్ట మరమ్మతుల కోసం మట్టి తోలకాలు : రాజ్‌ సుహాస్‌ (జేఈఈ)
సత్యనారాయణపురం సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఆర్‌డి 12 వద్ద తాలిపేరు కరకట్ట దెబ్బతిన్నదని దాని మెయింట్‌నెన్స్‌ పనుల కోసం మట్టి తోలకాలు సాగిస్తున్నట్లు ఇరిగేషన్‌ జేఈఈ రాజ్‌ సుహాస్‌ నవతెలంగాణకు తెలిపారు. ఇరిగేష్‌ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులకు గ్రామస్తులు అడ్డగించడం సరికాందన్నారు. పనుల అడ్డగింత కోసం వారి వద్ద ఎమైనా ఆధారాలు ఉంటే వాటిని తమకు చూపెట్టాలని ఆయన తెలిపారు.