భూమి ఉన్నంత వరకు ‘ఎన్టీఆర్‌’ చిరస్మరణీయుడు

– మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– కేసీఆర్‌కు ఎన్టీఆరే స్ఫూర్తి: ఎమ్మెల్యే సండ్ర
– సత్తుపల్లిలో అట్టహాసంగా ఎన్టీఆర్‌ శతజయంతి వేడుక
నవతెలంగాణ-సత్తుపల్లి
ఈ భూమి ఉన్నంత వరకు స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు చిరస్మరణీయంగా నిలిచి పోతుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం సత్తుపల్లి కమ్మసేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి తుమ్మల పాల్గొన్నారు. తొలుత పట్టణంలో ఎన్టీఆర్‌ అభిమానుల నేతృత్వంలో జరిగిన భారీ మోటారుసైకిలు ర్యాలీలో ఒకే బండిపై తుమ్మల, సండ్ర పాల్గొన్నారు. అనంతరం స్థానిక అటవీశాఖ అతిథిగృహం ఎదురుగా రాష్ట్రీయ రహదారిపై ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి తుమ్మల, సండ్ర గజమాలలేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ పక్కన ఏర్పాటు చేసిన సభలో తుమ్మల మాట్లాడారు. ఎన్టీఆర్‌ దయవల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆయనిచ్చిన భిక్షతోనే తాను ప్రజలకు సేవచేసే అదృష్టం కలిగిందన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని అనేక సంక్షేమ పథకాలను సమాజానికి అందిస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌ పేదల గుండెల్లో ఎప్పటికి ఉండిపోతారని సండ్ర అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మెన్‌ కూసంపూడి మహేశ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ ఛైర్మెన్‌ వనమా శ్రీనివాసుదేవరావు, ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, కౌన్సిలర్లు వీరపనేని రాధికాబాబీ, మట్టా ప్రసాద్‌, చాంద్‌పాషా, అద్దంకి అనిల్‌, నరుకుళ్ల శ్రీనివాసరావు, దేవరపల్లి ప్రవీణ్‌, గఫార్‌, నడ్డి ఆనందరావు, కంటె అప్పారావు, మేకల నరసింహారావు, కమ్మసేవా సంఘం బాధ్యులు కూసంపూడి మధుసూదనరావు, నాయుడు వెంకటేశ్వరరావు, పెద్దఎత్తున ఎన్టీఆర్‌ అభిమానులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్‌ జన్మదిన వేడుకలు
ఎర్రుపాలెం : విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఘనంగా నిర్వహించారు. ఎర్రుపాలెం బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళు లు అర్పించారు. కేక్‌ ను కట్‌ చేసి స్వీట్లు పంచి పెట్టి జన్మ దిన శుభా కాంక్షలు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష, పార్టీ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, యువజన అధ్యక్షులు కొండెపాటి సాంబశివరావు, మహిళా మండలి అధ్యక్షురాలు పులి శిరీష, సర్పంచ్‌ లు పురుషోత్తం రాజు, మొగిలి అప్పారావు, ఎంపీటీసీలు షేక్‌ మస్తాన్‌ వలి, సగ్గుర్తి కిషోర్‌ బాబు, గుర్రాల పుల్లా రెడ్డి, పాల్గొన్నారు.