ఖమ్మం గుమ్మంలో జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీలు

– 30 నుండి 6వ జాతీయ ‘మహిళా క్రికెట్‌ లీగ్‌’
– 12 రాష్ట్రాల నుండి తరలిరానున్న మహిళా క్రికెటర్లు
– ముఖ్యఅతిథులుగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్‌,
– ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌కుమార్‌
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం గుమ్మంలో మరో అతిపెద్ద మహిళా క్రికెట్‌ లీగ్‌కు వేళయింది. వరుసగా ఆరోసారి మహిళా క్రికెట్‌ లీగ్‌ పోటీలకు ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియం వేదికానుంది. తెలంగాణ విమెన్స్‌ టీ20 క్రికెట్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌కుమార్‌ సారధ్యంలో నిర్వహిస్తున్న ఈ మెగాటోర్నీకి మొత్తం 12 రాష్ట్రాల నుండి మహిళా క్రికెటర్లు పాల్గొననున్నారు. పూర్తిగా ఫ్లడ్‌ల్కెట్ల వెలుగుల్లో తళుకులీనే క్రికెట్‌ పోటీలను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందని టోర్నమెంట్‌ ఆర్గనైజర్‌ ఎండీ మతిన్‌ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, తెలంగాణ విమెన్‌ టీ.20క్రికెట్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌ కుమార్‌ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌, డయ్యూ-డామన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ మహిళా క్రికెటర్లు, టీం మేనేజర్లు, టీం కోచ్‌లు తరలిరానున్నారు. ఖమ్మంలో జరిగే పోటీల్లో పాల్గొనే వారికి వసతి, భోజన ఏర్పాట్లు, డ్రస్సులు యువం పౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ అందజేస్తారని తెలిపారు. ఈ మెగా టోర్నీకి ఏడబ్ల్యూఐసీఏ డైరెక్టర్‌ సందీప్‌ ఆర్య, సీనియర్‌ మహిళా క్రికెటర్లు పాలకుర్తి ఝాన్సీ, వి.వినోద, పద్మ, రాధిక, కల్యాణి, ప్రశాంతి, శివ, విజరు చౌదరి తదితరులు పాల్గొంటారని, యువం జిల్లా కన్వీనర్‌ రాజా టోర్నమెంట్‌ నిర్వహణలో ఉంటారని అన్నారు. తెలంగాణ జట్టుకు ఝాన్సీ, వినోద, శివ కోచ్‌లుగా ఉంటారని, సాయంత్రం 4.30 గంటలనుండి రాత్రి 11 గంటల వరకు టోర్నమెంట్‌లో భాగంగా క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని క్రికెట్‌ ప్రేమికులు జాతీయ స్థాయి మహిళా క్రికెట్‌ లీగ్‌ను విజయవంతం చేయాలని కోరారు.