దామరచర్ల @46.8

ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత
– ఈ వారంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం!
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రం భగభగ మండుతున్న ఎండలతో అట్టుడుకిపోతున్నది. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన విశ్వరూపాన్ని చూపుతున్నాడు. దీనికితోడు ఉక్కపోత తీవ్రంగా ఉంది. మరోవైపు వేడిగాల్పులు భయపెడుతున్నాయి. పెద్దపల్లి, నల్లగొండ జిల్లాలో ఎండలు మరీ ఎక్కువ ఉన్నాయి. నల్లగొండ జిల్లా దామరచర్లలో శుక్రవారం 46.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. వాస్తవానికి ఈ ఉష్ణోగ్రత ఒకటెండ్రు డిగ్రీలు ఎక్కువే ఉందన్న భావన కలుగుతున్నది. ఇప్పటిదాకా ఈ ఏడాది ఇదే అత్యధికం. పెద్దపల్లి జిల్లా ముత్తారంలోనూ 46 డిగ్రీలు దాటింది. రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. రెడ్‌ అలర్ట్‌ జాబితాలో నల్లగొండ, పెద్దపల్లి, సూర్యాపేట, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, కొమ్రంభీం అసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, తదితర జిల్లాలున్నాయి. ఆయా జిల్లాల ప్రజలు ఉష్ణోగ్రతలు, వేడిగాల్పుల వల్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధ్యమైనంత మేరకు ఎండలో బయటకు రావొద్దనీ, అత్యవసరమైతే పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.