నిరాకారి

అక్కడ ఏదో అస్పష్టంగా
ఓ శూన్యత
ఏదో చెబుతోంది
బిగ్గరగా….

తనను హింసిస్తున్న
అభాండాలు అవమానాలు
ఈర్ష్యాద్వేషాలు ఈసడింపులు
వేదింపులు హేళనలు
ఆవేదనలు ఆక్రోశములు
అవస్థలను

గుండెపగిలేంత గట్టిగా
రక్తనాళాలు చిట్లేలా….

రెండు చేతులతో
చెంపలు పట్టుకుని
మోకాళ్లపై కూర్చుని
పొగిలి పొగిలి
గొంతు చించుకుని
పిడచకట్టేటట్లు
దిక్కులు పిక్కటిల్లేలా….

అరచి అరచి ఆ అరుపులు
జీరబోతున్నాయి

అందరూ చూస్తూనే వెళ్తున్నారు
కానీ వారి చూపుల్లో
ఏ దైన్యం లేదు
పాపభీతి లేదు
ఏ భావాలు కనిపించడం లేదు

ఎవరి పనిలో వారున్నారు
ఏమీ పట్టనట్టు
ఏదీ కన్పించనట్టు

తనలోని ఆవేదన
ఆక్రోశంతో రోదిస్తోంది
ఆ రోదనలో
ఓ భయంకరమైన నిర్వేదం

ఆర్తనాదాలు
గాలిలో తేలిపోతున్నాయి
నిశ్శబ్ద నిశీధిలోకి
చెట్లు చేమలు
కొండలు గుట్టలు దాటుకుని

కానీ
ఏ ఒక్క మనిషికీ
వినిపించడంలేదేంటి !
ఏమిటీ వైపరీత్యం ?

అయ్యో
సాటి మనసు గోడు
వినే మనసున్నోళ్ళు లేరా ?

ఓ…
ఇప్పుడు అర్థమైంది
నేను మనసును కదా….
నాకు మాటలు రావు కదా….
నేను నిరాకారిని శూన్యతను కదా మరి….

పాపం
మనసులేని మనసులను
ఏమంటే ఏం ప్రయోజనం!
నా గోడు వాటికేం అర్థమవుతుంది?

గోడలకు చెబితేనైనా
కాస్తయినా
ఊరడింపు దొరుకుతుందేమో
గోడలకు చెవులుంటాయంటారు కదా!
ఆ గోడలకు మాత్రమే అర్థమౌతాయేమో!!
మనసు పడే గోడులు….
– నాగముని.యం, 9590856185