తల్లిదండ్రులకు కృతజ్ఞతగా ఉండండి

– గీతం పట్టభద్రులకు ఐఎస్‌బి వ్యవస్థాపక డీన్‌ ప్రొఫెసర్‌ ప్రమత్‌ రాజ్‌ సిన్హా
– ఘనంగా గీతం 14వ పట్టభద్రుల దినోత్సవం
– గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్‌
నవ తెలంగాణ-పటాన్‌చెరు
ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పెద్ద చేసిన తల్లిదండ్రులకు, అధ్యాపకులు, విద్యావేత్తలకు విద్యార్థులు ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌ఓ) వ్యవస్థాపక డీన్‌ ప్రొఫెసర్‌ ప్రమత్‌ రాజ్‌ సిన్హా ఉద్బోధించారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన 14వ పట్టభద్రుల దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన స్నాతకోపన్యాసం చేశారు. తరగతి గదిలో పాఠాల కంటే వెలుపల పాఠాలు ముఖ్యమైనవని, ఈ పట్టభద్రుల దినోత్సవాన్ని మానసికంగా జ్ఞప్తిపెట్టుకోవాలని సూచించారు. గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్‌ మాట్లాడుతు విద్యార్థులు కెరీర్‌లో ముందుకు సాగేందుకు పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి సభ్యుడు, తెలుగు సాహిత్య ఔన్నత్యానికి విశేష కృషిచేసిన ప్రఖ్యాత రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్‌ అందజేసి సత్కరించారు. ఎంఏ తెలుగు అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణుడైన తనను గీతమ్‌ గౌరవ డాక్టరేట్‌తో సత్కరిస్తుందని తెలిసిన తన అమ్మ మంచి ఔషధాలు రాయమని సలహా ఇచ్చిందని, అలాంటి గ్రామీణ నేపథ్యం తనదన్నారు. యురేనియం అవసరంలేని శక్తిని సృష్టించాలని గీతం విద్యార్థులకు సూచించారు. శాస్త్ర విజ్ఞానం ఎంత పెరిగినా సాహిత్యం పాత్ర ఎప్పటికీ తరగదని, కవిత్వం సమాజమంతా బాగుండాలని కోరుకుంటుందన్నారు. గీతం- హైదరాబాద్‌ వార్షిక నివేదికను అదనపు ఉపకులపతి (ప్రో వీసీ) ప్రొఫెసర్‌ డీ.ఎస్‌.రావు సమర్పించారు. గీతం, హైదరాబాద్‌లో ప్రస్తుతం 55 మంది అంతర్జాతీయ విద్యార్థులతో సహా 7,500 మంది రెగ్యులర్‌ విద్యార్థులు ఉన్నట్టు చెప్పారు. 180కి పైగా కంపెనీలు గీతమ్‌ను సందర్శించి, 700 మందికి పైగా విద్యార్థులను ఎంపిక చేసుకున్నట్టు తెలిపారు. గీతం హైదరాబాద్‌ ప్రాంగణంలో 1,265 మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌, మేనేజ్‌ మెంట్‌, సైన్స్‌, ఫార్మసీ, హ్యుమానిటీస్‌ వంటి వివిధ విభాగాలలో డిగ్రీలు పొందడానికి అర్హత సాధించారు. 1,141 మంది విద్యార్థులు, 10 మంది పరిశోధకులు వ్యక్తిగతంగా హాజరై పట్టాలను స్వీకరించారు.
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 21 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకున్నారు. గీతం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ డి. గుణశే ఖరన్‌ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.ఈ 14వ పట్టభద్రుల దినోత్సవంలో గీతం కార్యదర్శి ఎం.భరద్వాజ్‌, ఉపకులపతి ప్రొఫెసర్‌ దయానంద సిద్ధవట్టం, ప్రోవీసీలు డాక్టర్‌ గీతాంజలి బత్మనాబానే (మెడికల్‌ సైన్సెస్‌), డాక్టర్‌ కె.గౌతమరావు (క్యాంపస్‌ లెఫ్ట్‌)బీ డీన్లు ప్రొఫెసర్‌ కె.శ్రీకష్ణ, (సెర్చ్‌), ప్రొఫెసర్‌ సి.విజయశేఖర్‌ (ఇంజనీరింగ్‌), ప్రొఫెసర్‌ విభూతి సన్దేవ్‌ (అర్కిటెక్చర్‌), సయ్యద్‌ అక్బరుద్దీన్‌ (కౌటిల్యా స్చూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ)బీ అమిత్‌ భద్ర (మేనేజ్‌ మెంట్‌)బీ రెసిడెంట్‌ డైరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ పాల్గొన్నారు.