– పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్
నవతెలంగాణ-ఖమ్మం
న్యాయం కోసం వచ్చిన బాధిత మహిళలకు అండగా నిలిచి వారిలో మనో ధైర్యాన్ని నింపడానికి భరోసా సెంటర్ సాయపడుతోందని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 2023 సందర్భంగా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో నడుస్తున్న భరోసా సెంటర్, షీ టీం వారు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ హింసకు గురైన బాలికలు, మహిళలకు రక్షణ కల్పించేందుకు షీ టీం, భరోసా పనిచేస్తున్నాయని, వీటి ద్వారా మహిళలకు సత్వర న్యాయం జరుగుతుందని, ఆపదలో ఉన్నారని సమాచారం అందగానే వెంటనే స్పందించి అందుబాటులో ఉంటూ వారికి రక్షణ కల్పిస్తారని చెప్పారు. భరోసా సెంటర్ నుండి ముగ్గురు బాధిత బాలికలు, మహిళ కు భరోసా సహాయ నిధి నుండి 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో అవినాష్ కుమార్ ట్రైనీ ఐపీఎస్, ప్రసన్న కుమార్ ఏసిపి ఎస్‌బి, అంజలి సీఐ ట్రాఫిక్, నవీన్ సీఐ ట్రాఫిక్, డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పరిధిలోని అంగన్వాడీలు, డిఆర్‌డిఓ పరిధిలోని ఐకెపిలు, సఖి సిబ్బంది, షీ టీం, ఏహెచ్‌టియు, సైబర్ క్రైమ్ భరోసా సిబ్బంది పాల్గొన్నారు.