కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జులైలో మహాపడావ్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలైలో మహాపడావ్‌ నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఆదివారం హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐటీయూసీ నేత చంద్రయ్య అధ్యక్షతన కార్మిక సంఘాల సన్నాహక సమావేశం జరిగింది. కార్మిక సంఘాల నాయకులు చంద్రశేఖర్‌, బాల్‌రాజు, భూపాల్‌, జె. వెంకటేష్‌, ఈశ్వర్‌ ప్రసాద్‌, ప్రసాద్‌, అనురాధ తదితరులు మాట్లాడుతూ గత తొమ్మిదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్లను తెచ్చి కార్మిక హక్కులను హరిస్తున్నదని చెప్పారు. రైల్వే రక్షణ, ఫార్మా, సింగరేణి తదితర సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. ధర పెరుగుదలను అదుపు చేయకపోవడంతో కార్మికుల కొనుగోలు శక్తి క్షీణిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పెన్షన్‌ నిధులను కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వినాశకర చర్యలను ప్రతిఘటిస్తూ దేశ వ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ, సంఘాల అధ్వర్యంలో దేశ వ్యాప్త సమ్మెలు, ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయని చెప్పారు. జూలై, అగస్టు నెలల్లో మోడీ సర్కార్‌ కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రచార క్యాంపెయిన్‌తోపాటు 48 గంటల రిలే దీక్షలు చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో చంద్రశేఖర్‌ (ఐన్‌టీయూసీి), బాలరాజు, నర్సింహా (ఎఐటీయూసీ), భూపాల్‌, జె.వెంకటేష్‌, కె.ఈశ్వర్‌ రావు (సీఐటీయూ), ఈశ్వర్‌ ప్రసాద్‌ (హెచ్‌ఎంఎస్‌), ప్రసాద్‌ (టీఎన్‌యూసీ), అనురాధ (ఐఎఫ్‌టియు) తదితరులు పాల్గొన్నారు.