భవనం పైనుంచి పడి విద్యార్థిని మృతి

– బాచుపల్లి నారాయణ కళాశాలలో ఘటన
– ఆత్మహత్యా.. ప్రమాదమా.. లేక హత్యా.. అనే కోణంలో పోలీసుల దర్యాప్తు
నవతెలంగాణ-దుండిగల్‌
కాలేజీలో చేరిన వారం రోజులకే హాస్టల్‌ భవనం పైనుంచి పడి ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. అయితే ఇది ఆత్మహత్యా.. ప్రమాదమా.. లేక హత్యా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాకు చెందిన రాగుల వంశిత (16) వారం రోజుల క్రితం బాచుపల్లిలోని నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీలో చేరింది. అలాగే ఆమె కళాశాల హాస్టల్‌లో ఉంటోంది. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం క్లాసుకు వెళ్లిన వంశిత ఆరోగ్యం బాగోలేదని, విశ్రాంతి తీసుకుంటానని టీచర్‌ అనుమతి తీసుకొని బయటకు వచ్చింది. అనంతరం హాస్టల్‌ పై అంతస్తు ఎక్కి అక్కడి నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. దాంతో కళాశాల యాజమాన్యం వెంటనే బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వంశిత బిల్డింగ్‌ పై నుంచి దూకిందా? లేక పడిపోయిందా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కళాశాల ముందు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా
కళాశాలకు చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులు తమ కుమార్తె మృతి పట్ల అనుమానం వ్యక్తం చేశారు. దాంతో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కళాశాల గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. నారాయణ కళాశాలపై చర్యలు తీసుకొని తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థి నాయకుల మధ్య కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎట్టకేలకు వారిని పోలీసులు శాంతింపజేశారు.