ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యం

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-మొయినాబాద్‌
ప్రభుత్వాస్పత్రిల్లోనే నాణ్యమైన వైద్యం అందుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలల్లో భాగంగా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్‌లో జిల్లా ఉప వైద్యాధికారి దామోదర్‌ ఆధ్వర్యంలో బుధవారం వైద్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేండ్ల క్రితం ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే ప్రజలు భయపడేవారనీ, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వా స్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక జైన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల వారు అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రులకు వచ్చే వారిని ఆప్యాయంగా పలకరించి వైద్యం అందించాలని సూచించారు. చేవెళ్ల ఆర్డీవో వేణు మాధవరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పదేండ్ల కాలంలో చేపట్టిన పలు అంశాలలో సాధించిన విజయాలపై, సంబురాలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. జిల్లా ఉప వైద్యాధికారి దామోదర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేసిందని తెలిపారు. అనంతరం లబ్దిదారులకు న్యూట్రిషన్‌ కిట్‌, ఎన్సిడి కిట్లలు, ఆశా వర్కర్లకు చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల శంకర్‌పల్లి, మొయినాబాద్‌, షాబాద్‌ మండలాలకు చెందిన తహసీల్దారులు ఎంపీడీవోలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధి కారులు, ఆశా వర్కర్లు,అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణులు తదితరులు పాల్గొన్నారు.