పెరియార్‌ జీవితం బహుముఖం

‘రీడర్‌’ పుస్తకావిష్కరణలో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కులానికి వ్యతిరేకంగా గణాన్ని వినిపించి, ప్రజల్ని చైతన్యవంతం చేసిన గొప్ప వ్యక్తి పెరియార్‌ రామస్వామి అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆయన జీవితం బహు ముఖం అనీ, భిన్న పార్శ్వాలతో భవిష్యత్‌ను ముందే ఊహించి అద్భుత రచనలు చేశారని కొనియాడారు. దుస్సాంప్రదాయాలపై ఆయన చేసిన పోరాటాల గురించి నేటి తరానికి మరింత వివరంగా తెలియాల్సి ఉందన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌-జాషువా-పూలే-పెరియార్‌ లిటరేచర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌హాల్‌లో ‘పెరియార్‌ రీడర్‌’ పుస్తకా విష్కరణ సభ జరిగింది. విల్సన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి ప్రధాన సంపాదకులు డాక్టర్‌ కే శ్రీనివాస్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వీక్షణం పత్రికా సంపాదకులు ఎన్‌ వేణుగోపాల్‌, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌, తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ఆమరుల కుటుంబం నుంచి ఆత్మకూరి రమణయ్య, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు గీతా రామస్వామి తదితరులు మాట్లాడారు. కులరహిత గ్రామాల పునర్నిర్మాణం కోసం పెరియార్‌ తపించారనీ, ‘దేవుడులేడు’ అంటూ బలమైన వాదనను లేవనెత్తి, ఆ పేరుతో జరుగుతున్న దుర్నీతి, దుష్ప్రచారాన్ని తీవ్రంగా తిప్పికొట్టారని చెప్పారు. బ్రాహ్మణ, గుత్తాధిపత్య వ్యతిరేక భావజాలానికి వ్యతిరేకంగా వైకోం ఉద్యమంతో సమాజ పురోగతిని మార్చే స్థాయిలో ప్రజాచైతన్యం తెచ్చారన్నారు. ఆయన రచనలు మరిన్ని ప్రజాబాహుళ్యంలోకి రావల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రాముడు దేవుడు కాదంటూ ఆయన చేసిన వాదనకు ఇప్పటికీ మనువాదులు సమాధానం చెప్పలేదన్నారు.
సమాజంలో పెరియార్‌ భావజాలం మిగిలే ఉందనీ, మోడీ, అమిత్‌షా, సంఫ్‌ుపరివార్‌ చేతుల్లో భారత సమాజం చిక్కి ఉన్నదనీ, దానికి విముక్తి కల్పించాలంటే బ్రాహ్మణ, గుత్తాధిపత్య వ్యతిరేక భావజాలాన్ని విస్తరించాలని అభిప్రాయపడ్డారు. ఏకత్వ సమాజాన్ని అంగీకరించేది లేదని పెరియార్‌ నిర్ధ్వంధంగా చెప్పారని అన్నారు. పెరియార్‌ను మరింత అధ్యయనం చేసి, అర్థం చేసుకోవాలనీ, ఆదిశగా నేటి యువతరం పరిశోధనలు సాగించాలని తెలిపారు. పెరియార్‌ చేసింది మానవ హక్కుల ఉద్యమం అనీ, అలాంటి వారిపై పాలకవర్గాల నిర్భంధాలు సహజమేనని చెప్పారు. జైలు జీవితాన్ని కూడా తన ఉద్యమానికి అనుకూలంగా మార్చుకున్న గొప్ప వ్యక్తి పెరియార్‌ అని కొనియాడారు.