ఎంపీ సంచలన వ్యాఖ్యలు

– నిధులను కొడుకు పెండ్లికి, ఇల్లుకు వాడుకున్న..
– వైరల్‌ అవుతున్న వీడియో
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎంపీల కోసం ప్రత్యేకంగా కేటాయించే ఎంపీ ల్యాడ్స్‌ నిధులను సొంత ఖర్చుల కోసం వాడుకున్నట్టు స్వయంగా ఎంపీనే వ్యాఖ్యానించారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో జరిగిన బీజేపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయగా.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌ అవుతోంది. ఈ సంవత్సరం విడుదలైన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి తన సొంత ఇంటి నిర్మాణం చేయడమే కాకుండా.. కుమారుని వివాహానికి సైతం వాడుకున్నట్టు ఎంపీ సోయం బహిరంగంగా ప్రకటించారు. అయితే, గతంలో ఎంపీలుగా పనిచేసిన నాయకులు దోచుకున్నట్టుగా నిధులను దుర్వినియోగం చేయలేదని, తన సొంత ఖర్చులకు కొద్ది మొత్తం మాత్రమే ఖర్చు చేశానని స్పష్టం చేశారు. ఆ నిధులను సైతం తిరిగి చెల్లిస్తానన్నారు. ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతోనే తాను నిధుల్లో నుంచి ఖర్చు చేసినట్టు ఆయన చెప్పినట్టు వీడియో వైరల్‌ అవుతోంది.