రాజస్తాన్‌లో మసీదుకు నిప్పు

– నిందితుల్లో బీజేపీ నేత, సహచరులు
జైపూర్‌: రాజస్తాన్‌లోని ఓ పురాతన మసీదుకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ నెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. నిందితుల్లో స్థానిక బీజేపీ నేత రమన్‌ గులాటి కూడా ఉన్నారని అన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మొత్తం 14 మందిపై ఐపీసీ సెక్షన్స్‌ 143, 153 ఎ, 295 ఎ, 427, 436, 504, 506ల కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు. వివరాల ప్రకారం… రాజస్తాన్‌లోని అల్వార్‌ జిల్లా బహదూర్‌పూర్‌లోని పురాతన మసీదును ఇటీవల బాగు చేసి, ప్రార్థనలు చేస్తున్నారు. జూన్‌ 20 మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బీజేపీ నేతతో పాటు ఓ గుంపు మసీదుకు నిప్పటించింది. దీంతో మసీదులోని సామగ్రి దగ్ధమైంది. నిందితులు జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేయడంతో పాటు మసీదు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో… మతవిద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్థి పొందేందుకు బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఇటువంటి చర్యలకు దిగుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.