వ్యసనం ఏదైనా సరే అది మనిషి జీవితంపై ప్రభావం చూపకుండా ఉండలేదు. రకరకాల వ్యసనాల్లో మద్యపానం వల్ల కలిగే నష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మద్యానికి అలవాటు పడి కుటుంబాన్ని, జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వారిని మనం ఎంతో మందిని చూస్తూనే ఉన్నాం. ఎంత చెప్పినా వారిలో మార్పు రాదు. మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తూనే ఉంటారు. మద్యం మత్తులో మనుషులు అంతగా మునిగిపోతున్నారు. అలా మద్యానికి బానిసై కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేస్తున్న ఓ కొడుకు జీవితాన్ని బాగు చేసుకునేందుకు తల్లి పడుతున్న వేధనే ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
రాజేశ్వరమ్మకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. భర్త లేడు. అతను కూడా మద్యానికి బానిసై రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఒంటరిగానే పిల్లలను పోషించింది. కూతురు పెండ్లయి అత్తారింటికి వెళ్లిపోయింది. ఇక ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు సునీల్. బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు. రాజేశ్వరమ్మ ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తుంది. ఆ వచ్చిన డబ్బుతోనే ఇల్లు గడుపుతుంది. కూతురు తనకు తోచిన సహాయం చేస్తుంది. సునీల్ మాత్రం తల్లికి సాయం చేయకపోగా దొరికిన చోటల్లా అప్పులు చేస్తుంటాడు. ఆ అప్పులన్నీ రాజేశ్వరమ్మనే తీర్చాలి. రెండో కొడుకు రాజేష్‌కు ప్రస్తుతం 20 ఏండ్లు. అతనైనా మంచిగా ఉంటాడనుకుంటే పెద్ద కొడుక్కంటే దారుణంగా తయారయ్యాడు. 15 ఏండ్లకే తాగడం మొదలుపెట్టాడు. గుట్కాలు కూడా తింటాడు. తల్లి మాటంటే ఎవ్వరికీ లెక్కలేదు. రాజేష్ తల్లి నిద్రపోయిన తర్వాత మెల్లగా ఇంటికి వస్తాడు. కాలేజీకి వెళ్లమని చెప్పినా వెళ్లడు. చుట్టుపక్కల వారి సలహాతో తను ఉద్యోగం చేసే కంపెనీలోనే రాజేష్‌ను కూడా పనిలో పెట్టింది. కానీ కొన్ని రోజులు చేసి మానేశాడు. వేరే చోట ఉద్యోగం చూసుకున్నాడు. తాగడం కూడా ఎక్కువయింది. తల్లి అడిగితే ‘నేను చేసే పని అలాంటిది, తాగితే తప్ప కుదరదు’ అంటుంటాడు. దాంతో రాజేశ్వరమ్మ ఆ ఉద్యోగం మాన్పించి ఇంకో ఉద్యోగం చూసుకోమంది. ఎన్ని ఉద్యోగాలు మారినా రాజేష్ తాగుడు మాత్రం మానడం లేదు. పైగా 18 ఏండ్లు నిండినప్పటి నుండి ‘ఉద్యోగం చేస్తున్నాను కదా! నాకూ పెండ్లి చేయండి, అక్క పెండ్లి కూడా అయిపోయింది కదా!’ అనడం మొదలుపెట్టాడు.
‘ఉండటానికి సరిగా ఇల్లు లేదు, వయసేమో చిన్నది. ఇప్పుడే పెండ్లేంటి. నీకంటే పెద్దోడు సునీల్ ఉన్నాడు. వాడికి చేయకుండా నీకెలా చేయాలి’ అంటూ ఎలాగో పెండ్లిని వాయిదా వేస్తూ వస్తుంది. కానీ అతని తాగుడు మాత్రం మాన్పించలేకపోతుంది. ప్రస్తుతం ఎవరి మాటా వినే స్థితిలో లేడు. తాగకుండా అస్సలు ఉండలేకపోతున్నాడు. తాగకపోతే చనిపోతాడేమో అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. దాంతో చివరకు తల్లే అతనికి మద్యం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాగే ఉంటే పెద్దోడిలా చిన్నోడి జీవితం కూడా నాశనం అయిపోతుందని రాజేశ్వరమ్మకు భయం పట్టుకుంది. ఆ భయంతోనే ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
మేము రాజేష్‌ను పిలిపించి ‘ఎందుకింతలా తాగుతున్నావు. నీ వల్ల మీ అమ్మ చాలా బాధపడుతుంది. నీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఇలా తాగుతుంటే నీకు పిల్లని ఎవరిస్తారు. అసలు నీకేమైనా సమస్య ఉంటే మాతో చెప్పు. పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాము. అంతే కానీ నువ్వు ఇలా తాగుతూ ఉంటే నీకు జీవితమే ఉండదు. మీ నాన్న కూడా ఇలాగే తాగితాగి చనిపోయాడు. తర్వాత నీ పరిస్థితి కూడా అంతే అవుతుంది. తాగకపోతే నువ్వు మీ అమ్మను చాలా బాగా చూసుకుంటావని చెప్పింది. మీ అన్నయ్య కూడా మందుకు బానిసై అప్పులు చేసి మీ అమ్మను బాధపెడుతున్నాడు. కనీసం నువ్వైనా ఆమె కష్టాన్ని అర్థం చేసుకోవాలి కదా? మీ కోసం ఒంటరిగా ఎంతో కష్టపడుతుంది. మీ నాన్న లేకపోయినా మీకు ఏ లోటూ లేకుండా చూడాలని తపిస్తుంది. మీరు సంతోషంగా ఉంటే చూడాలని కోరుకుంటుంది. తన సుఖాలన్నీ వదులుకొని మీ కోసం కష్టపడుతుంది. అలాంటి తల్లిని మీరు బాధపెడుతున్నారు. మీ అమ్మ గురించి ఒక్కసారి ఆలోచించు. కచ్చితంగా మందు మానేస్తావు’ అని చెప్పి మళ్లీ 15 రోజుల తర్వాత రమ్మనమని చెప్పాము.
రెండు వారాల తర్వాత వచ్చిన రాజేష్ ‘తాగకుండా రెండు రోజులు కూడా ఉండలేకపోతున్నాను మేడమ్. మీరు చెప్పింది విన్న తర్వాత మానేయడానికి చాలా ప్రయత్నించాను. కానీ నా వల్ల కావడం లేదు’ అని చెప్పాడు. దాంతో మేము అతన్ని డాక్టర్ దగ్గరకు వెళ్లమని చెప్పాము. అక్కడకు వెళితే పదిహేను రోజులు మందులు వాడమన్నారు. అవి వాడి మళ్లీ వస్తానని చెప్పాడు. మళ్లీ నెల రోజుల తర్వాత ఐద్వా ఆఫీస్‌కు వచ్చి ‘దీని వల్ల కూడా ఫలితం లేదు మేడం, మరో మార్గమేదైనా ఉంటే చెప్పండి. నేను చచ్చిపోతానేమో అని భయంగా వుంది’ అంటూ ఏడ్చాడు. అప్పుడు మేము అతన్ని రీహాబిటేషన్ సెంటర్‌కు పంపించాము.
ఆ సెంటర్లో రాజేష్‌కు అన్ని రకాల పరీక్షలు చేసి ఆరు నెలలు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం అతనిలో చాలా మార్పు వచ్చింది. ఇంకా మూడు నెలలు అక్కడే ఉంటే మంచిదని సెంటర్ వాళ్లు చెప్పారు. ‘మరో మూడు నెలల్లో పూర్తిగా మద్యం మానేసి మా అమ్మా, అన్నయ్యతో హాయిగా ఉంటాను. నన్ను ఇక్కడికి పంపించి చాలా మంచి పని చేశారు. నా జీవితాన్ని నిలబెట్టారు. నన్ను మళ్లీ మనిషిని చేశారు. మళ్లీ ఉద్యోగం చూసుకున్న తర్వాత మీ దగ్గరకు అప్పుడప్పుడు వస్తుంటాను’ అన్నాడు. దానికి మేము కచ్చితంగా రావొచ్చు అని అతనికి ధైర్యం చెప్పాము.
– వై వరలక్ష్మి,
9948794051