ఎత్తు తగ్గితే సమస్యలే :ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ : ఎత్తు తక్కువగా ఉన్న పిల్లలకు పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ఒక నివేదికలో తెలిపింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో ఉంటున్న చిన్నారులు పొడవుగా ఉంటారు. అయితే ఈ వెసులుబాటు ఇకపై వారికి ఎంతో కాలం ఉండకపోవచ్చు. 1990-2020 మధ్యకాలంలో 5-19 సంవత్సరాల మధ్య వయసున్న వారికి సంబంధించిన శరీర ద్రవ్యరాశి సూచిక (బీఎంఐ)పై ఐసీఎంఆర్‌ ఓ నివేదికను రూపొందించింది. ప్రపంచవ్యాపంగా పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలను ఈ నివేదిక అధ్యయనం చేసింది. దీని ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న చిన్నారుల బీఎంఐలో వ్యత్యాసాలు తగ్గిపోతున్నాయి. అంటే పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న పిల్లలు పొందుతున్న ప్రయోజనాలు, వారి వృద్ధి తగ్గుతూ వస్తోంది. ఈ విషయాలను నేచర్‌ జర్నల్‌ పత్రిక తాజా సంచికలో ప్రచురించారు.
ఎత్తు తక్కువగా ఉన్నా, బీఎంఐ తక్కువగా ఉన్నా అనారోగ్యానికి గురికావచ్చునని, ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని అధ్యయనం తెలిపింది. తక్కువ ఎత్తు ఉన్న వారు వివేకవంతులు కాలేరని, భవిష్యత్తులో విద్యలో వారి పనితీరు కూడా సరిగా ఉండదని వివరించింది. 5-19 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో బీఎంఐ అధికంగా ఉంటే జీవితకాలం ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని, వారు సాధారణ వ్యాధులకు గురవుతారని పేర్కొంది.
‘పిల్లలలో శారీరక శ్రమ తగ్గుతోంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. పట్టణ ప్రాంతాల వారి కంటే గ్రామీణ ప్రాంతాల వారిలో బీఎంఐ పెరుగుతోంది. దీంతో రెండు ప్రాంతాలకూ చెందిన 5-19 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో బీఎంఐ తేడా తగ్గుతోంది. పిల్లల అభివృద్ధి కోసం అవసరమైన విధానాలు, కార్యక్రమాలను అమలు చేయాల్సి ఉంది. పేదరికం, ద్రవ్యోల్బణం, పౌష్టికాహార లోపం, కోవిడ్‌ కారణంగా వచ్చిన మార్పులు, ఉక్రెయిన్‌ యుద్ధం వంటి పరిణామాలు అభివృద్ధికి ఆటంకాలుగా నిలిచాయి. పిల్లలు ఆరోగ్యంగా వృద్ధి చెందడానికి సైతం ఇవి ప్రతిబంధకాలుగా ఉన్నాయి’ అని ఆ నివేదిక వివరించింది.