26,226 మంది విద్యార్థులకు 1.1 లక్షల నోట్‌ పుస్తకాల పంపిణీ

– పై ఇంటర్నేషనల్‌ విరాళం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కర్నాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోని 26,226 మంది విద్యార్థులకు 1.1 లక్షల నోట్‌ పుస్తకాలను కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద పంపిణీ చేసినట్టు పై ఇంటర్నేషనల్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకులు, ఎండీ రాజ్‌కుమార్‌ పై, డైరెక్టర్లు మీనా ఆర్‌ పై, రాహుల్‌ ఆర్‌ పై, గురుప్రసాద్‌ పై, ఉత్తమ్‌కుమార్‌ పై , పుష్పా పై, జయశ్రీ పై సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 17 ఏండ్లుగా పై సంస్థ అంకితభావంతో విద్యార్థులకు నోట్‌ పుస్తకాలను పంపిణీ చేస్తున్నదని వివరించారు. తుంకూర్‌, మైసూర్‌, ఉడుపి, మంగళూరు, కేరళ, హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో నాలుగు వేల మంది విద్యార్థులకు నోట్‌పుస్తకాలను అందించామని పేర్కొన్నారు. పర్యావరణం, వృద్ధుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కోటి మొక్కలను నాటామని వివరించారు. వెయ్యిమంది వృద్ధులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితాన్ని కల్పించామని తెలిపారు.