ధరణి లోపాలే గందరగోళానికి కారణం

– భూమి కబ్జా చేశారు అనడంలో వాస్తవం లేదు
– అసత్యపు ప్రచారాలు మానుకోవాలి
– తిమ్మాపూర్‌ భూ వ్యవహారంపై మీడియా సమావేశం ఏర్పాటు
పట్టాదారు రిజిస్ట్రేషన్‌ చేయకుండానే పాసుబుక్కులు జారీ సంజీవని ప్రాజెక్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రత్తిపాటి శ్రీధర్‌
నవతెలంగాణ-కొత్తూరు
తిమ్మాపూర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 97/ఆ లోని మూడు ఎకరాల పట్టా భూమికి సంబంధించి మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయిస్తున్న బీపీ నాయుడు, సుప్రజా ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీ యాజమాన్యంపై చట్టపరంగా ముందుకు వెళ్తామని సంజీవని ప్రాజెక్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ పత్తిపాటి శ్రీధర్‌ తెలిపారు. మంగళవారం ఆయన రైతులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటుచేసి వివరాలను వెల్లడించారు. 1954 55 ఖాస్రా పహాని ప్రకారం సర్వేనెంబర్‌ 97/ఆ లో 9 ఎకరాలు 20 గుంటలు, సర్వేనెంబర్‌ 97 /ఆ లో మూడు ఎకరాల 37 గుంటలు వేరువేరుగా నమోదు అయి ఉన్నాయి. 1954 55 ఖాస్రా మొదలుకొని 2000 సంవత్సరం వరకు సర్వేనెంబర్‌ 97/ఆ కొండ అంజయ్య పట్టాదారుగా వస్తున్నాడు. దయాధులు 97/ఆ లో తమకు భాగం ఉందని కోర్టుకు వెళ్లడంతో తీర్పు వారికి వ్యతిరేకంగా వచ్చింది. కొండ అంజయ్యకు కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. 2018 సంవత్సరం నాటికి కొండ అంజయ్య మరణించడంతో భార్య కొండ రాధమ్మ పేరిట మూడు ఎకరాలు విరాసత్‌ అయింది. అనంతరం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి 2019లో ప్రత్తిపాటి శ్రీధర్‌, మేక శ్రీవల్లిలకు అట్టి భూమిని విక్రయించింది. భూమి కొనుగోలు చేసిన ప్రత్తిపాటి శ్రీధర్‌ రెండు ఎకరాలకు హెచ్‌ఎండీఏ లో వెంచర్‌ చేయడానికి దరఖాస్తు చేసుకోవడంతో అతనికి అనుమతులు సైతం వచ్చాయి. కన్వర్షన్‌ అయిన తర్వాత అట్టి భూమి బీపీ నాయుడు, సుప్రజా కన్స్ట్రక్షన్‌ ప్రయివేటు లిమిటెడ్‌ పేరిట 2022లో పట్టా పాస్‌ బుక్కులు సైతం వచ్చినవి. కానీ ఈసీ లో మాత్రం డాక్యుమెంట్‌ నెంబర్‌ లేకుండా కేవలం ఖాతా నెంబర్‌ మాత్రమే చూపెడుతుంది. మేము ఎలాంటి రిజిస్ట్రేషన్‌ చేయకుండా మా పట్టా భూమి అతనికి అమ్మినట్టుగా కొత్త పాస్‌ బుక్కులు సష్టించాడని వారు ఆరోపించారు. ధరణిలోని లోపాలే ఈ గందరగోళానికి దారి తీసినట్లు స్పష్టమవుతుంది. ఇదే విషయమై స్థానిక తహసీల్దార్‌ రాములు ను ఫోన్లో వివరణ కోరగా అట్లాంటి రిజిస్ట్రేషన్‌ ఏది తమ దగ్గర జరగలేదని మా లాగిన్‌ కు రాలేదని దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించామని తెలిపారు. ఈ భూమిపై చట్ట పరంగా పూర్తి హక్కులు తమకే కలిగి ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.