వయసు దాటాకే…

ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌ అంటే తెలియని పిల్లలు లేరు. రెండేండ్లు కూడా నిండని పిల్లలు ఫోన్‌లకు అలవాటు పడిపోతున్నారు. ఇది వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పిల్లలు, ముఖ్యంగా యువత ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియాకు బానిసలుగా మారి అర్థ రాత్రివరకూ ఫోన్లను ఉపయోగించడం అధికమైందని, దీని వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, చిరాకు, అసహనం అధికం కావడం, శారీరక శ్రమకు దూరం కావడంతో పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, యువకులు రోజుకు కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోయే విధంగా తల్లిదండ్రులు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. కొంతమంది పిల్లలు అదే పనిగా ఫోన్‌ పట్టుకుని ఉండటం వల్ల నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని సర్వేల్లో వెల్లడయింది. కాబట్టి మొబైల్‌ ఫోన్‌, టాబ్‌, లాప్‌టాప్‌ల ఉపయోగాన్ని పరిమిత సమయంలోనే వినియోగించేలా చూడాలని సూచించారు. సోషల్‌ మీడియాపై మన నియంత్రణ ఉండాలి కానీ అవే మనల్ని నియంత్రించే స్థాయిలో ఉండకూడదని వారు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా రోజుకు నాలుగు గంటల కన్నా అధికంగా ఇంటర్నెట్‌ ఉపయోగిస్తే అది వ్యసనం కిందకి వస్తుందని తెలిపారు. విద్యాపరమైన అవసరాలకే ఇంటర్నెట్‌ వినియోగం ఉత్తమమని, అపరిమితంగా ఉపయోగిస్తే కలిగే అనర్థాలను పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పాలంటున్నారు. ఇంట్లోనే సంగీత సాధన, వ్యాయామం లాంటివి అలవాటు చేసి, సెల్‌ఫోన్‌లకు పిల్లలను సాధ్యమయినంత దూరం చేయాలని సూచిస్తున్నారు.