పని బారెడు..వేతనం మూరెడు

ఏండ్లతరబడి పని చేస్తున్న జీపీ కార్మికుల బతుకులు అగమ్యగోచరంగా మారుతున్నాయి. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పని చేసినా కనీస వేతనానికి కూడా నోచుకోక పస్తులుండాల్సిన దుస్థితి వారిది. ఏడాదంతా కష్టపడితే వచ్చే వేతనం ఆస్పత్రులకు కూడా సరిపోవడం లేదు. అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వేతనాల విషయంలో ఎటూ తేల్చడం లేదు. గంపడంత ఆశతో ఎదురు చూపులు తప్ప కనీస వేతనానికి నోచుకోవడం లేదు. స్వరాష్ట్రంలోనైనా తమ బతుకులు మారుతాయని ఆశ పడిన జీపీ కార్మికులకు ఆడియాశలే ఎదురవుతున్నాయి. దాంతో పంచాయతీ ఉద్యోగుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మారింది. చీపుర్లతో వీధులను శుభ్రం చేస్తున్న తమ జీవితాలు ఎన్నడు శుభ్ర పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బతుకులు ఇంకెన్నడు బాగుపడుతాయంటున్నారు. సమ్మెలు, ధర్నాలు, ఆందోళనలు తప్ప తమకు ఆదెరువు లభించడం లేదంటున్నారు. సమ్మెల సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోవడం లేదని నిలదీస్తున్నారు. అందుకే మరోసారి జీపీ కార్మికులు ఈ నెల 6వ తేదీ నుంచి సమ్మెబాట పట్టనున్నారు.
కనీస వేతనానికి నోచుకోని కార్మికులు పనిభారంతో జీపీ ఉద్యోగులు సతమతం ఏండ్ల తరబడి పని చేస్తున్నా ఉద్యోగ భద్రత కరువు ఉద్యోగానికి భద్రత లేదు.. సచ్చినా ఇన్సూరెన్స్‌ రాదు జూలై 6 నుంచి జీపీ కార్మికుల సమ్మెబాట
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పల్లెల్లో పారిశుధ్య కార్మికులకు పనిభారంతో సతమతమవుతున్నారు. పట్టించుకునే వారే కరువయ్యారు. పెరుగుతున్న జనాభాకనుగుణంగా పారిశుధ్య కార్మికులను నియమించడం లేదు. ఉన్న సిబ్బందితోనే నెట్టుకురావాలని ఒత్తిడి తెస్తుండటంతో ఉన్నవారిపై అదనపు పనిభారం పడుతోంది. గ్రామస్థాయిలో ఏ చిన్న కార్యక్రమం నిర్వహించాలన్నా పంచాయతీ ఉద్యోగుల ప్రమేయం లేకుండా సాధ్యం కాదు. రాత్రి పగలు, తేడా లేకుండా పనులు చేయిస్తూనే ఉంటారు. ఇంత చేసినా వేతనాల పెంపు విషయంలో మాత్రం తమను పట్టించుకునే దిక్కులేదని పంచాయతీ ఉద్యోగులు వాపోతున్నారు.పైగా నెలనెల వేతనాలు కూడా రావడం లేదు. నాలుగైదు మాసాలకు ఒకసారి వేతనాలు ఇస్తుండటంతో మరింత కుంగిపోతున్నారు.
పని ఎక్కువ వేతనం తక్కువ
రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో పనిచేసే ఉద్యోగులతో పోల్చుకుంటే అత్యంత ఎక్కువ పనిచేస్తూ అతి తక్కువ వేతనం పొందుతున్నది కేవలం గ్రామపంచాయతీ కార్మికులే. ప్రస్తుతం ఇస్తున్న రూ.8,500 ఏ మూలకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా నెలనెలా చేతికి అందకుండా విడతల వారీగా చెల్లిస్తున్నారని మండిపడుతున్నారు. ఇస్తున్న ఈ వేతనంలో కూడా ఇద్దరు కార్మికులు కలిసి తీసుకుంటున్నారు. ఇక తమ కుటుంబాల పోషణ ఎలా సాధ్యమవుతుందని వాపోతున్నారు.
జిల్లాలో 2500 మంది జీపీ కార్మికులు
జిల్లాలోని 27 మండలాల్లో మొత్తం 558 గ్రామపంచాయతీలు ఉండగా వాటిలో 25వందల మంది వరకు పంచాయతీ కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో మల్టీపర్పస్‌ వర్కర్లు, స్వీపర్లు, ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, బిల్‌కలెక్టర్లు, కారోబార్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, అటెండర్లు రూపంలో పని చేస్తున్నారు. వీరందరికీ నెలవారీ వేతనాలు రావడం లేదు. పంచాయతీల నుంచి ప్రతి నెలా బిల్లులు ఎస్టీఓలకు పంపుతున్నా బిల్లులు కావడం లేదు. బడ్జెట్‌ లేకపోవడం వల్ల రెండు, మూడు నెలలైనా వేతనాలు బిల్లులు కావడం లేదు. దాంతో కార్మికులు అర్థాకలితో అలమటిస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు
కనీస వేతనానికి నోచుకోకుండా ఏండ్లుగా వెట్టి చాకిరీకి గురవుతున్న పంచాయతీ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం చేయాలని ఈ నెల 6 నుంచి సమ్మెబాట పట్టనున్నారు. జీవో నెంబర్‌ 51ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతున్నారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలంటున్నారు. గ్రామపంచాయతీ ఉద్యోగులకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, మల్టీపర్పస్‌ వర్కర్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కేటగిరీల వారీగా వేతనాలు ఇవ్వాలంటున్నారు. కారోబార్లకు స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వాలని కోరుతున్నారు. అనేక డిమాండ్లతో సమ్మెకు సన్నద్ధం అవుతున్నామని కార్మికులు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి నోటీసులు అందజేశామంటున్నారు.
రెగ్యులరైజ్‌ చేయాలి
గ్రామపంచాయతీల్లో బతుకు పోరాటం చేస్తున్న కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వెట్టిచాకిరిలోనే నెట్టివేస్తుంది. వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలి. ప్రతీ కార్మికుడికి ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలి. కారోబార్లకు అసిస్టెంట్‌ సెక్రెటరీగా, జూనియర్‌ అసిస్టెంట్‌గా స్పెషల్‌ స్టేటస్‌ కల్పించాలి. జనాభా ప్రాతిపధికన కార్మికులను నియమించాలి. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా స్పందించాలి. పరిష్కరించేందుకు కృషి చేయాలి.
జాపాల జగన్‌, కారోబార్‌
వెట్టిచాకిరీ చేస్తున్నాం...
సంవత్సరాల నుంచి గ్రామపంచాయతీకి వెట్టిచాకిరి చేస్తున్నప్పటికీ కాలేకడుపులతోనే ఉండాల్సి వస్తుంది. నెలకు ఇచ్చే వేతనం రూ.8500తో కుటుంబపోషణ కష్టమవుతోంది. పిల్లల చదువులు, వైద్య ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం తమకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదు. పైగా మల్లీపర్పస్‌ విధానాన్ని తెచ్చింది. ఉద్యోగ భద్రత కరువైంది. ప్రభుత్వం గ్రామపంచాయతీ ఉద్యోగుల వేతనాలు పెంచి ఆదుకోవాలి.
గ్యార పాండు, ఉమ్మడి జిల్లా జేఏసీ చైర్మన్‌