ఉపాధి హామీ పథకంలో టెక్నాలజీ

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో పురోగతిని పరిశీలించేందుకు, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. పనుల అంచనాలు మరింత పారదర్శకంగా ఉండేందుకు, పథకానికి సంబంధించిన ప్రాజెక్టులను మెరుగ్గా పర్యవేక్షించేందుకు టెక్నాలజీని వినియోగిస్తారు. అంచనాలు మరింత కచ్చితత్వంతో ఉండేందుకు, పని పురోగతిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు టెక్నాలజీ సాయం తీసుకుంటామని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో అంచనాలను రూపొందించడం, పనుల పురోగతిని పర్యవేక్షించడం వంటి పనుల్ని ఇంజినీర్లు చేసే వారు. అయితే వారు భౌతికంగా వేసే అంచనాలలో కచ్చితత్వం లోపిస్తోంది. ఈ నేపథ్యంలో సాంకేతిక సాయం తీసుకునే దిశగా మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రైవేటు కంపెనీలను, ఐఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు వంటి సాంకేతిక సంస్థలను పలు దఫాలుగా సంప్రదించింది. అయితే చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. డ్రోన్లు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు, మొబైల్‌ పరికరాలు వంటి వాటిని ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. పని ప్రదేశంలో 3డీ ల్యాండ్‌ ప్రొఫైల్‌ను చేపట్టే అంశం కూడా పరిశీలనలో ఉంది.
ఉపాధి పథకంలో కార్మికుల హాజరు నమోదు కోసం ఇప్పటికే నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. వేతనాలు చెల్లించేందుకు ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఏబీపీఎస్‌)ను తప్పనిసరి చేశారు. అయితే ఈ రెండు నిర్ణయాలను కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఏబీపీఎస్‌ అమలును ఆగస్ట్‌ 31వ తేదీ వరకూ వాయిదా వేశారు.