– సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
ఇంకుడు గుంతలు భూగర్భ జలాలు పెంపునకు దోహదపడతాయని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను స్థానిక నాయకులతో కలిసి సర్పంచ్ జీఎల్ఎన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి సరిహద్దులతో పాటు బోరు బావుల పరిసరాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు సమృద్ధిగా నిలువ ఉంటాయని అన్నారు. నిబంధనల ప్రకారం నిర్మించుకునే ఇంకుడు గుంతల ఖర్చును ప్రభుత్వం ద్వారా పొందవచ్చని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని లబ్ది పొందాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు నరేందర్ రెడ్డి, మల్లయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్, వెంకటయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.