పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకే వైద్యశిబిరాలు

– ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షులు,జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్‌
– కోనాపూర్‌ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
– 235 మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ
– 15 అసంపూర్తి ఇండ్ల నిర్మాణాలకు సహకరిస్తానని హామీ
నవతెలంగాణ-ఆమనగల్‌
పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, తలకొండపల్లి మండల జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్‌ అన్నారు. ఆమనగల్‌ మండలంలోని కోనాపూర్‌ గ్రామంలో సోమవారం ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ ఉప్పల అఖిల్‌ నేతత్వంలో కామినేని ఆస్పత్రి వైద్య బృందం సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రస్ట్‌ చైర్మెన్‌, జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్‌ హాజరై మాట్లాడారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వారు సీజనల్‌ వ్యాధుల బారినపడకుండా 50కి పైగా మేజర్‌ గ్రామ పంచాయతీలలో వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా 235 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్టు జడ్పీటీసీ వెంకటేష్‌ కుమారుడు డాక్టర్‌ ఉప్పల అఖిల్‌ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకులతో కలిసి ఉప్పల వెంకటేష్‌ గ్రామంలోని ప్రధాన వీధులలో పర్యటించి గుడిసెల్లో నివాసముంటున్న ఎస్‌.జంగయ్య, బి.జంగమ్మ, కే.సాలయ్య, వి.చిన్న రాములమ్మ, కే.నర్సింహ పూర్తి ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు అసంపూర్తిగా ఉన్న 15 కుటుంబాల ఇంటి నిర్మాణాలకు తన ట్రస్టు ద్వారా సహకారం అందజేస్తానని ఉప్పల లబ్దిదారులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కడారి మల్లమ్మ యాదయ్య, తలకొండపల్లి ఎంపీపీ తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్‌, చీపునుంతల సర్పంచ్‌ బి.రఘుపతి, మాజీ ఎంపీటీసీ సభ్యులు డి.యాదయ్య, స్థానిక నాయకులు, ఉప్పల వెంకటేష్‌ మిత్ర మండలి సభ్యులు కిషోర్‌ నాయక్‌, నాగిళ్ళ జగన్‌, విజేష్‌, మహేష్‌, అంజద్‌, కుమార్‌, శేఖర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, చంద్రకాంత్‌, యాదగిరి, వెంకటేష్‌, కృష్ణ, శివ, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.