

గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో మండలంలోని వాగులు ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని దెయ్యాల వాగు, గుండ్ల వాగు, సల్లోర్రె, మంగలోర్రె , గౌరారం వాగు ప్రమాద స్థాయిలో ప్రవహించాయి. రైతులు జంతువులు దాటేందుకు వీలు లేకుండా ఉప్పొంగి ప్రవహించాయి. లక్నవరం చెరువులోకి బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు 22 అడుగుల నీరు చేరిందని నీటిపారుదల శాఖ అధికారి హర్షద్ తెలియజేశారు. ఇంకా వాటర్ ఇన్ ప్లో కొనసాగుతుందని ఉదయం వరకు మరో రెండు అడుగులు పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. మండలంలోని పలు కాలనీలోకి ఇళ్లలోకి నీరు చేరడంతో గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ప్రోక్లైన్ల సహాయంతో సైడ్ డ్రైన్ కాలువలను శుభ్రం చేయించడంతో వరద నీరు తగ్గుముఖం పట్టింది. జిల్లాను రెడ్ అలర్టుగా ప్రకటించడం వల్ల అధికారులు కూడా రాత్రింబవళ్లు అప్రమత్తంగా ప్రజలను వర్ష పరిస్థితులను గమనిస్తున్నారు. మరో రెండు రోజులు వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ ప్రకటనలతో అధికారులు ప్రజలను మరింత అప్రమత్తం చేశారు. పలు సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది.