25న మణిపూర్‌ సంఘీభావ దినం : కూనంనేని

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించిన ఘటన అంతర్జాతీయంగా భారతదేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. దీనికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్షమే కారణమని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది అత్యంత అనాగరిక, ఆటవిక చర్య అని విమర్శించారు. తక్షణమే ఈ ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో, మణిపూర్‌లో ఉన్న బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ స్వార్థ పూరిత రాజకీయాల వల్లే రెండునెలలకు పైగా మణిపూర్‌ జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్నదని విమర్శించారు. సుప్రీం కోర్టు మణిపూర్‌ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించేంత వరకు ప్రధాని మోడీ మౌనం వహించారని తెలిపారు. మణిపూర్‌ ఘటనను ఖండించాలనీ, బీజేపీ ప్రభుత్వాల వైఖరిని వ్యతిరేకించాలని, ఈ నెల 25న సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించే ‘మణిపూర్‌ సంఘీభావ దినం’కు మద్దతు ప్రకటించాలని కోరారు.
మణిపూర్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి : పీవోడబ్ల్యూ
మణిపూర్‌లో ఆదివాసీ మహిళలపై జరిగిన దారుణ అఘాయిత్యాన్ని, లైంగిక దాడిని ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) జాతీయ కన్వీనర్‌ వి సంధ్య గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నేరస్తులను శిక్షించాలని తెలిపారు. మణిపూర్‌లో మానవ హక్కుల హననం జరుగుతున్నదనీ, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు