– సీపీఐ మండల నాయకులు జంగిలి కష్ణ
– 16వ రోజుకు చేరిన పంచాయతీ కార్మికుల సమ్మె
– సంఘీభావం తెలిపిన సీపీఐ నాయకులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
గ్రామపంచాయతీ కార్మికులు అంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదని సీపీఐ ఇబ్రహీంపట్నం మండల నాయకులు జంగిలి కష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో చేస్తున్న సమ్మెకు సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బందిలో ఎక్కువ శాతం మంది అనగారిన పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే పని చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వారిపైన చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. 16 రోజుల నుండి ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఎండకు ఎండుతు, వానకు తడుస్తూ సమ్మె చేస్తున్నా ప్రభుత్వం,అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మక్కునేరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతును తెలియజేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కార్మిక సంఘాలు పిలుపునివ్వాలన్నారు. కార్మికులు చేసే ఏ ఉద్యమానికైనా భారత కమ్యూనిస్టు పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు శివరాల లక్ష్మయ్య, విజరు కుమార్, ములుగు నరసింహ తదితరులు పాల్గొన్నారు.