మహారాష్ట్రలో వర్షాలు,

– వరదలకు 72 మంది మృతి..
ముంబయి: మహారాష్ట్రలో కొన్ని రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 72 మంది మరణించారు. భారత వాతావరణ శాఖ జూలై 21న థానే, రారుగఢ్‌, పూణే, పాల్ఘర్‌లకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ముంబై, రత్నగిరికి కూడా అధికారులు ‘ఆరెంజ్‌’ అలర్ట్‌ ప్రకటించారు. కొల్హాపూర్‌ జిల్లాకు కూడా రాబోయే 5 రోజుల పాటు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. థానే, పాల్ఘర్‌, రారుఘడ్‌, రత్నగిరి, కొల్హాపూర్‌, సాంగ్లీలలో కుండపోత వర్షాలను ఎదుర్కోవడానికి యన్‌ డీ ఆర్‌ ఎఫ్‌ బందాలు ఇప్పటికే మోహరించాయి.
రారుగఢ్‌లో ఇంకా దొరకని 86 మంది ఆచూకీ
మహారాష్ట్ర రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రహదారులు నదులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రారుగఢ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఇంకా 86 మంది ఆచూకీ తెలియరాలేదు. వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.