పాఠశాలల పనివేళల మార్పు తల్లిదండ్రులకు కష్టం

– ప్రయివేటు బడులకు ఊతం
– నిర్ణయాన్ని ఉపసంహరించాలి : టీపీఎస్వీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తెలంగాణ పౌర స్పందన వేదిక (టీపీఎస్వీ) తీవ్రంగా విభేదించింది. ఎలాంటి సంప్రదింపుల్లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు టీపీఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాలల పనివేళల మార్పు తల్లిదండ్రులకు కష్టమని తెలిపారు. ఇది ప్రయివేటు బడులకు ఊతం కలిగిస్తుందని పేర్కొన్నారు. నిపుణుల సూచనలు, సలహాల మేరకే పాఠశాలల వేళలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్ణయించారని తెలిపారు. కానీ ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు మారుస్తూ ఉత్తర్వులు విడుదల చేశారని పేర్కొన్నారు. కూలీలు, కార్మికులు, చిరుద్యోగులు, వివిధ రకాల పనుకెళ్లే వారు ఉదయం వారితోపాటు పిల్లలను కూడా తయారు చేసి బడులకు పంపి వెళ్తారని వివరించారు. కనీస పరిజ్ఞానం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి పనులకు, బడుల సమయానికి ఉన్న వ్యత్యాసం వల్ల పొంతన కుదరదని తెలిపారు. ప్రయివేటు పాఠశాలలు ఉదయం ఒక గంట ముందే ప్రారంభమై సాయంత్రం 4.30 గంటల నుంచి ఐదు గంటల వరకు నడుస్తున్నాయని వివరించారు. అవి ప్రజలకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల సమయం కలిసిరాకపోవడం వంటి సమస్యలతో ఎక్కువ మంది ప్రజలు వారి పిల్లలను ప్రయివేటు బడులకు పంపేందుకు ఇష్టపడతారని తెలిపారు. కరోనా కాలం నుంచి ప్రయివేటు స్కూళ్లలో అధిక ఫీజులు చెల్లించలేక ఇప్పుడిప్పుడే ప్రభుత్వ బడుల్లోకి పంపుతున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ప్రయివేటు బడులకు తిరిగి వెళ్లేందుకు దోహదపడుతుందని తెలిపారు.