ప్రారంభోత్సవానికి సిద్ధమైన మీడియా అకాడమీ భవనం

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణ మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లోని నాంపల్లి చాపల్‌ రోడ్డులో ఉన్న పాత ప్రెస్‌ అకాడమీ స్థానంలో దీనిని నిర్మించిన సంగతి తెలిసిందే. వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో 29,548 చదరపు అడుగుల్లో అద్భుతంగా దీనిని నిర్మించారు. ఈ భవనం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కెేసీఆర్‌ను మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ఆహ్వానించారు. ఆయన సమయం కోసం చూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాత అకాడమీ భవనంలో ఫిబ్రవరి 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో కొత్త భవనం నిర్మించాలని సూచించారు. ఆ మేరకు 2017లో భవన నిర్మాణానికి రూ.15 కోట్లు విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌ కర్త, కర్మ, క్రియగా ఈ భవనం రూపుదిద్దుకున్నది. భవనంలో జర్నలిస్టుల కోసం నాలుగు తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక అంతస్తు. 250 మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియం, గ్రంథాలయం, చైర్మెన్‌, తదితరులకు ప్రత్యేక గదులు నిర్మించారు. తరగతి గదుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన కంప్యూటర్ల రూమ్‌ను కూడా నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరిగింది. ఇటీవల నిర్మాణం పూర్తయిన సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తో కలిసి సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ అశోక్‌ రెడ్డి, డైరెక్టర్‌ రాజమౌళి తదితర అధికారులు అకాడమీ భవన నిర్మాణం పర్యవేక్షించారు. భవనం పనులన్నీ తుదిదశకు వచ్చినందున, మిగిలిన అరకొర పనులు పూర్తిచేసి మెరుగులు దిద్దవలసిందిగా ఆర్‌ అండ్‌ బి అధికారులను కోరారు. త్వరలో నగరం నడిబొడ్డున మీడియా అకాడమీకి కార్పొరేట్‌ స్థాయి సొంత భవనం సిద్ధమయింది. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వల్ల, జర్నలిస్టుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి వల్ల ఇది సాధ్యమైందని మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. త్వరలో మీడియా అకాడమీ భవనం ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించుకుంటామని చెప్పారు.