మరుగున పడ్డ చరిత్రను వెలికితీస్తున్నాం.

– చందో వైవిధ్య గ్రంథావిష్కరణలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
– రచయిత సంగయ్యను అభినందించిన మంత్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘రాష్ట్రంలో మరుగున పడ్డ చరిత్రను వెలికితీస్తున్నాం. చారిత్రక, శాసన, భాషా పరిశోధనలో కొత్త కోణాలను వెలికి తీయడం దేశ శాసన పరిశోధనలో తొలి ప్రయత్నం’ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో ప్రముఖ రచయిత, చరిత్ర పరిశోధకులు డాక్టర్‌ లగడపాటి సంగయ్య రూపొందించిన ‘కాకతీయుల శాసనాలలో ఛందో వైవిధ్యం’ అనే గ్రంథాన్ని మంత్రి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంగయ్యను అభినందించి, ఈ సందర్భంగా మాట్లాడుతూ చరిత్ర రచన, శాసన, భాషా శాస్త్రంలో కొత్త కోణాలను వెలికితీయడం తొలి ప్రయత్నమ న్నారు. కాకతీయుల కాలంనాటి 142 శాసనాలను అధ్యయనం చేసి 49 రకాల చందస్సును విశ్లేషించడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ద్వారా సాహిత్య, చారిత్రక, సాంస్కృతిక, కళాత్మక అంశాలు, శాసన పరిశోధన గ్రంథాలను సేకరించి ప్రచురిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ, ప్రముఖ చరిత్ర పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి, సామజిక వేత్త కురేళ్ళ వేములయ్యగౌడ్‌లు పాల్గొన్నారు.