బీడీ కార్మికులకు కుర్‌కురేలను అంటగట్టం

– హామీ ఇచ్చిన యాజమాన్యం
– కంపెనీ యాజమాన్యంతో సీఐటీయూ చర్చలు
నవతెలంగాణ-కంఠేశ్వర్‌
బలవంతంగా బీడీ కార్మికులకు కుర్‌కురేలను అంటగట్టబోమని బీడీ యాజమాన్యం హామీనిచ్చిందని తెలంగాణ బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ తెలిపారు. దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యం బీడీ కార్మికులతో బలవంతంగా కుర్‌కురేలు, తిను బండారాలను అమ్మిస్తూ.. వారికి వచ్చే బట్వాడాల నుంచి డబ్బులు తీసుకుంటున్న విషయాన్ని దశల వారి పోరాటాల ద్వారా కార్మిక శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయిన విషయం తెలిసిందే. కాగా, బుధవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో బీడీ యూనియన్‌ నాయకులు నూర్జహాన్‌, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్‌ బాబు, మోహన్‌, జిల్లా అధ్యక్షులు శంకర్‌ గౌడ్‌తో.. దేశారు బీడీ కంపెనీ యాజమాన్యం తరఫున అనిల్‌, సంజరు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బీడీ కార్ఖానాల్లో కార్మికులకు కుర్‌కురేలను కానీ, ఇతర తినుబండారాలను కానీ అమ్మకాలు జరపకుండా చర్యలు చేపడతామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఒకవేళ ఎవరికైనా బలవంతంగా వాటిని అమ్మితే నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఇకపైన ఏ కార్ఖానాల్లో కార్మికులు వాటిని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. కార్మికుల బట్వాడాల్లో కోతలు లేకుండా చూస్తామని హామీ నిచ్చారు. చర్చల్లో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఏశాల గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు