– అందుబాటులో 12,071 సీట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ద్వితీయ సంవత్సరంలో (లాటరల్ ఎంట్రీ) ప్రవేశాలకు నిర్వహించిన ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్) కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఈసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 29 నుంచి ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు అవకాశముంటుందనీ, ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు. ఈనెల 31 నుంచి వచ్చేనెల రెండు వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. అదేనెల 31 నుంచి వచ్చేనెల నాలుగు వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశముంటుందని పేర్కొన్నారు. అదేనెల ఎనిమిదిన తొలివిడత సీట్లు కేటాయిస్తామని వివరించారు. పూర్తి వివరాలకు https://tsecet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. అయితే ఈసెట్ కౌన్సెలింగ్‌లో 12,071 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ)లో 2,657 సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ)లో 1,743 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ (సీఎస్‌ఎం)లో 1,280 సీట్లు, మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ (ఎంఎంటీ)లో 1,122 సీట్లున్నాయని తెలిపారు.