వరద బాధిత ప్రాంతాల్లో

– ముమ్మరంగా శానిటేషన్‌ పనులు
– సీఎస్‌ శాంతి కుమారి ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
భారీ వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా వరద బాధిత ప్రాంతాలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో చేపట్టిన సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రత్త చర్యలపై కలెక్టర్లతో శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డీజీపీ అంజనీ కుమార్‌, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, జలమండలి ఎండీ దాన కిషోర్‌, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, ఫైర్‌ సర్వీసుల శాఖ డీజీ నాగిరెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు వరద బాధిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ అధికారులు, జిల్లా యంత్రాగం మొత్తం చేసిన సమిష్టి కృషితో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారని అభినందించారు. మరో 24 గంటల పాటు ఇదే రకమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్‌ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిచాలని కలెక్టర్లను కోరారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధి తులకు మౌలిక సదుపాయాల ఏర్పాటు, సరిపడా ఆహారం, మంచినీరును అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సహాయ చర్యల్లో నిమగమైన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అక్కడే కొనసాగించాలని స్పష్టం చేశారు.