సుక్మాలో ఎదురుకాల్పులు

– ఆరుగురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించి ఉండొచ్చు.. లేదా గాయాలపాలై ఉండొచ్చని పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు మృతదేహాలు లభ్యం కాలేదన్నారు. చింతగుఫా, కిష్టారం పోలీసు స్టేషన్‌ పరిధిలోని చోటేకేద్వాల్‌ గ్రామ సమీపంలోని డివిజనల్‌ కమిటీ మెంబర్‌, కిష్టారం ఏరియా కమిటీ ఇన్‌ఛార్జి రాజుతోపాటు 30 నుంచి 35 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడ పోలీసులు కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య గంట పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురి నుంచి ఆరుగురు మావోయిస్టులు మృతిచెంది ఉండొచ్చు.. లేదా గాయపడి ఉండొచ్చు అని పోలీసులు పేర్కొన్నారు. అయితే వారిని మావోయిస్టులు అడవుల్లోకి లాక్కెళ్లి ఉండొచ్చని, ఆచూకీ కోసం కూంబింగ్‌ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.