– ఎంపీ బాపూరావు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన రిజర్వేషన్ల మీద ఆదిలాబాద్ ఎంపీ బాపూరావు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమనీ, బీజేపీ లంబాడీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు సంజీవ్‌రావు, శ్రీదేవి ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ లంబాడీ సామాజికతెగ రిజర్వేషన్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని నొక్కి చెప్పారు. గిరిజన రిజర్వేషన్లను మత రిజర్వేషన్లతో ముడి పెడుతూ.. రాజకీయం చేస్తున్న బీఅర్‌ఎస్‌కు ప్రజలు తగిన బుద్ది చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఎత్తేసిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇద్దరు దళిత నేతలు తమ పార్టీలో చేరడం వల్ల ఉత్తర తెలంగాణలో మరింత బలం పెరిగిందన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంద న్నారు. కేంద్రం నిధులు రాష్ట్రం వద్ద ఉన్నా ఎందుకు సహకారం అందించట్లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.