కాశ్మీర్‌ లోయలోకి తేజస్‌ యుద్ధ విమానాలు

జమ్మూ. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘తేజస్‌’ యుద్ధవిమానాలను తాజాగా భారత వైమానిక దళం జమ్మూకాశ్మీర్‌కు తరలించింది. పాకిస్థాన్‌తో సరిహద్దు పంచుకుంటున్న ఈ ప్రాంతంలోని లోయల్లో గగనవిహార అనుభవాన్ని పైలట్లు పెంచుకునేలా చూడటానికి దీన్ని చేపట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం విస్తృత స్థాయిలో ఈ యుద్ధవిమానాలు నింగిలో కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించాయి. జమ్మూ కాశ్మీర్‌లో భారత వైమానిక దళానికి అనేక స్థావరాలున్నాయి. చైనా, పాక్‌లను ఎదుర్కోవడానికి ఇవి చాలా కీలకం కానున్నాయి. జమ్మూకాశ్మీర్‌లోనే కాకుండా లడ్డాక్‌కూ భారత వైమానిక దళం యుద్ధ విమానాలను తరలిస్తోంది. అక్కడి ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల్లో గగనవిహార అనుభవాన్ని ఈ యుద్ధవిమానాల పైలట్లు గడించడం దీని ఉద్దేశం. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చెందిన తేజస్‌కు వైమానిక దళం ఎంతో ప్రాధాన్యతనిస్తోంది.