ఐకేపీ వీఓఏలను సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించాలి

ఐకేపీ –  కనీసవేతనం, ఇతర డిమాండ్లపై క్యాబినెట్‌లో చర్చించండి :మంత్రి ఎర్రబెల్లికి ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఐకేపీ వీఓఏలను సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించాలనీ, కనీస వేతనం రూ.26వేలు, రూ.10 లక్షల బీమా సౌకర్యం, తదితర డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తమ సమస్యల పరిష్కారంపై క్యాబినెట్‌ సమావేశంలో చర్చించాలని విజ్ఞప్తి చేసింది. సోమవారం హైదరాబాద్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఆ యూనియన్‌ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు ఎస్వీ.రమ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నగేశ్‌, ఆఫీస్‌ బేరర్లు వెంకటయ్య, శరత్‌కుమార్‌, అంజి, వసియా బేగం, రాములు, దుర్గయ్య, రాష్ట్ర నాయకులు కుమార్‌, ఆంజనేయులు, మల్లయ్య పాల్గొన్నారు. ఈ సంందర్భంగా వారు మంత్రి దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. 44 రోజుల సమ్మె సందర్భంగా మంత్రి ఇచ్చిన హామీని ప్రస్తావించారు. సమ్మె విరమించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని వాపోయారు. రాష్ట్రంలో గ్రామ మహిళా సమాఖ్యల ద్వారా పొదుపు సేకరణ, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న వీఓఏల పట్ల ఇలా వ్యవహరించడం తగదన్నారు. కనీస వేతనాల పెంపుదలపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి పెంచాలని కోరారు. సెర్ప్‌ నుంచి గుర్తింపు కార్డులు, గ్రామ సంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతినెలా వేతనాల చెల్లింపు, అర్హులైన విఓఏలను సిసిలుగా ప్రమోషన్స్‌, ఎస్‌హెచ్‌జి, వీఏ లైవ్‌ మీటింగ్స్‌ రద్దు, జాబ్‌ చార్ట్‌తో సంబంధం లేని ఆన్‌లైన్‌ పనులు రద్దు తదితర కోర్కెలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.