జస్టిస్‌ రోహిణి కమిషన్‌ నివేదిక సమర్పణ

– ఓబీసీల ఉప వర్గీకరణపై మోడీ ప్రభుత్వం ముందుకు వెళుతుందా?
న్యూఢిల్లీ : ఓబీసీల ఉప వర్గీకరణ అంశంపై నియమించిన జస్టిస్‌ రోహిణి కమిషన్‌ తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. దీంతో ఓబీసీల ఉప వర్గీకరణ అంశం ఇప్పడు మోడీ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఉన్న 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీ లోని వివిధ కులాలకు పంచే విషయంపై 2017లో జస్టిస్‌ రోహిణి కమిషన్‌ను మోడీ ప్రభుత్వం నియమించింది. ప్రారంభంలో 12 వారాల్లో నివేదికను సమర్పించాలని కమిషన్‌ను ఆదేశించినా.. తరువాత 14 సార్లు గడువును పొడిగించారు. దీంతో నియమించిన ఆరేండ్ల తరువాత ఎట్టకేలకు కమిషన్‌ తన నివేదికను సమర్పించింది. ఈ ఏడాది జులై 31తో పదవీకాలం ముగియడంతో సోమవారం కమిషన్‌ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఓబీసీ కులాల మధ్య రిజర్వేషన్‌ను విభజించే చర్య వివాదాన్ని రేకెత్తించడమే కాకుండా.. రాజకీయంగానూ ప్రభావం చూపుతుంది. కాబట్టే ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం ఇంతకాలం సాగదీసుకుంటూ వచ్చింది. అయితే కమిషన్‌ తన నివేదికను సమర్పించడంతో ఓబీసీ ల సబ్‌ కోటా విషయం ఇప్పుడు మోడీ ప్రభుత్వం వద్దకు చేరింది. మరోవైపు.. దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనాభా గణన నిర్వహించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో జస్టిస్‌ రోహిణి కమిషన్‌ తన నివేదికను సమర్పించడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కుల గణనకు బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. అయితే అనేక పార్టీలు, సంఘాలు కుల గణన కోసం డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఓబీసీల సబ్‌ కోటాలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటోందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.