గ్రామీణులు ప్రభుత్వ వైద్యసేవల్ని వినియోగించుకోవాలి

– రౌండ్‌టేబుల్‌లో గవర్నర్‌ తమిళసై
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు ఉన్నా, వాటిని వినియోగించుకోవడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపట్లేదని గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ అన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ స్కీం క్రింద కేంద్ర ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్‌ కేంద్రాలు నెలకొల్పిన విషయాన్ని ప్రస్తావించారు. రెండు మూడు సార్లు ఈ కేంద్రాలకు వచ్చిన వాళ్లు తమ వైద్యాన్ని అక్కడే కొనసాగించుకోవాలని భావించట్లేదనీ, ఈ లోపాన్ని ప్రభుత్వాలే సరిదిద్దాలనీ, ఆ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ఫౌండేషన్‌ ఫర్‌ ఫ్యూచరిస్టిక్‌ సిటీస్‌ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రాజ్‌భవన్‌లో ‘మహిళా ఆరోగ్యం’ అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందుతున్నదనీ, దీనివల్ల వారి జీవితాల్లో అనేక మార్పులు సంభవిస్తున్నాయన్నారు. గిరిజన మహిళల్లో ఆరోగ్యం పట్ల మరింత అవగాహన, శ్రద్ధ పెరగాలన్నారు. గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకు, ఆ తర్వాత కూడా పౌష్టికాహారాన్ని గర్భిణికి అందించాలనీ, ఈ మేరకే ప్రభుత్వాల విధానాలు రూపొందాలని చెప్పారు. మహిళల్లో మోనోపాజ్‌ దశ కీలకమైందనీ, ఈ సమయంలో వారిలో మానసికంగా, శారీరకంగా అనేక మార్పులు సంభవిస్తాయనీ, వాటిని కుటుంబసభ్యులు అర్థం చేసుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్పెషాలిటీ వైద్య సేవలు విస్తరించాలనీ, దాని ప్రధాన్యతను గుర్తించేలా ప్రచార కార్యక్రమాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలనీ, మిల్లెట్ల ఆహారాన్ని తీసుకోవాలనీ, గ్రామీణ ప్రాంతాలకు మోబైల్‌ వైద్యసేవలు మరింత ఆధునికంగా విస్తరించాలని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్‌ డాక్టర్‌ అమరేశ్వర్‌, డాక్టర్‌ కమల్‌కిరణ్‌తో పాటు వివిధ స్పెషాలిటీ విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు.