శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో

– రూ. 82 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం
నవతెలంగాణ హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ. 82.42 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో తనిఖీలు నిర్వహించగా.. ఇద్దరు ప్రయాణికుల వద్ద బంగారం పట్టుబడినట్లు పేర్కొన్నారు. దోహా నుంచి సోమవారం అర్ధరాత్రి ఓ ప్రయాణికుడు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అతని వద్ద రూ. 42.96 లక్షల విలువ చేసే 701 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. అయితే ఈ బంగారాన్ని పురీషనాళంలో దాచి తరలిస్తుండగా పట్టుబడ్డాడు. బ్యాంకాక్‌ నుంచి మంగళవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు చేరుకున్న మరో ప్రయాణికుడి నుంచి 700 గ్రాముల బంగారాన్ని సీజ్‌ చేశారు. దీని విలువ రూ. 39.46 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.