బ్రిడ్జి గిర్డర్‌ యంత్రం పడి 20 మంది కార్మికులు మృతి

 The bridge girder machine fell 20 workers died

–  మహారాష్ట్రలో ఘోరం
షాహాపూర్‌ (మహారాష్ట్ర) : మహారాష్ట్రలోని థానే జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. షాహా పూర్‌ తాలుకాలో ఖుతాడి సర్లాంబే గ్రామంలో ఉదయం 1 గంట ప్రాంతంలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే మూడో దశ నిర్మాణ సమయంలో గిర్డర్‌ యంత్రం కూలిపోవడంతో 20 మంది కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు సైట్‌ ఇంజనీర్లు, 12 మంది కార్మికులు ఉన్నారు. ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనుల్లో భాగంగా బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఒక్కసారిగా గిర్డర్‌లు మోసే యంత్రం 100 అడుగుల ఎత్తు పైనుంచి కార్మికులపై పడింది.
ఘటనాస్థలంలోనే 15మంది కార్మికులు మతి చెందారు. గాయాలపాలైన ముగ్గుర్ని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను షాహాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు. ప్రమాద సమాచారం తెలిసివెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక బృందాల కంటే ముందుగా సహాయక చర్యలు ప్రారంభించారు.
ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ పరిశీలించారు. మృతుల కుటుంబాలు ఒక్కొరికి రూ 5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.మరోవైపు లోకమాన్య తిలక్‌ జాతీయ అవార్డు కార్యక్రమం కోసం మంగళవారం పూణేకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రమాదంపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ 2 లక్ష పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ 50 వేల సహాయం ప్రకటించారు.